ఆలస్యంగానైనా జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో కాల్వలకు నీళ్లు వదిలారు. వర్షాధారంతో పాటు నీటి ఆధారం కింద వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
కర్నూలు(అగ్రికల్చర్): ఆలస్యంగానైనా జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో కాల్వలకు నీళ్లు వదిలారు. వర్షాధారంతో పాటు నీటి ఆధారం కింద వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
యూరియా అవసరం బాగా పెరిగింది. ఒకవైపు వరి నాట్లు ముమ్మరంగా పడుతున్నందున రైతులు యూరియా కోసం వస్తున్నారు. మరోవైపు పత్తికి కూడా యూరియా వేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. డిమాండ్‌కు తగిన విధంగా యూరియాను సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలం అవుతోంది. యూరియా కొరత ఏర్పడటంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. దీంతో ప్రైవేటు డీలర్లు యూరియాను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వరినాట్లు వేసే సమయంలో ఎకరాకు కనీసం 50 కిలోల యూరియా వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలే సూచిస్తున్నారు. ఆగస్టు నెలలో జిల్లాకు 17050 టన్నుల యూరియా రావాల్సి ఉంది. 4 వేల టన్నులు ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలిపోవడంతో 10750 టన్నులు మాత్రమే జిల్లాకు వచ్చింది. రావాల్సిన దానిలో 6300 టన్నులు రాకపోవడం వల్లనే కొరత ఏర్పడింది. ఇటీవల వచ్చిన యూరియాను జిల్లాలోని ప్రైవేటు డీలర్లందరికి సరఫరా చేశారు. 50 కిలోల బస్తా ధర రూ.285 ఉండగా ప్రైవేటు డీలర్లు రవాణా చార్జీల పేరుతో రూ.350 వరకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.
కొంతమంది డీలర్లు లారీల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి బ్లాక్‌లో అమ్మకాలు సాగిస్తున్నారు. వెల్దుర్తి, డోన్, నంద్యాల, కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని తదితర ప్రాంతాల్లో యూరియా అమ్మకాలు బ్లాక్‌లోనే జరుగుతుండటం గమనార్హం. అడ్డూ అదుపు లేకుండా అధిక ధరలకు యూరియా అమ్ముతున్నా వ్యవసాయ శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు. సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు మార్క్‌ఫెడ్ ద్వారా యూరియాతో పాటు ఇతర ఎరువులు కేటాయిస్తారు. వీటి ఎరువుల సరఫరాకు మార్క్‌ఫెడ్ రవాణా చార్జీలను కూడా భరిస్తుంది. కనుక విధిగా రూ.285 ప్రకారం యూరియా రైతులకు అమ్మాల్సి ఉంది.
కానీ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో కూడా అధిక ధరలకు యూరియా విక్రయిస్తుండటం గమనార్హం. ఆగ్రో రైతు సేవ కేంద్రాల్లో బస్తాపై ఎమ్మార్పీ కంటే రూ.50 ఆపైనే ఎక్కువ ధర వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయాధికారులు, ఏడీఏలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి యూరియా అమ్మకాలను క్రమబద్ధీకరించాలని కలెక్టర్ ఆదేశించినా వ్యవసాయాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వ్యవసాయ శాఖ జిల్లాలో యూరియాకు అవసరం లేనప్పుడు భారీగా సరఫరా చేసింది. అవసరం ఉన్నప్పుడు సరఫరా చేయకుండా పక్క జిల్లాలకు మళ్లిస్తోంది. ఇప్పటికైనా డిమాండ్‌కు తగిన విధంగా యూరియాను సరఫరా చేయాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖపై ఉంది.