దక్షిణ తెలంగాణలో  ప్లాంటు పెట్టండి

Agriculture Minister Said Nano Urea Plays Key Role In Soil Conservation - Sakshi

‘ఇఫ్కో’కు మంత్రి సింగిరెడ్డి వినతి

నానో యూరియా ప్లాంటుకు ప్రభుత్వం మద్దతిస్తుందని హామీ

సాక్షి, హైదరాబాద్‌: భూసార పరిరక్షణలో నానో యూరియా కీలకంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌ కలోల్‌లోని ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను శాస్త్రవేత్తలు, అధికారులతో కలిసి సంద ర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దక్షిణ తెలంగాణ నానో యూరియా ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రాంతమని, ఈ దిశగా ఇఫ్కో యోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నానో యూరియా విస్తృత వాడకానికి సహకారం అందించాలని కోరారు. వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని, నానో యూరియా వినియోగంతో భూసార పరిరక్షణతో పాటు తక్కువ వినియోగంతో అధిక దిగుబడులు సాధించే వీలుందన్నారు. మంత్రితో పాటు జాతీయ సహకార సంఘాల అధ్యక్షులు, మాజీ ఎంపీ దిలీప్‌ సంగానియా, ఇఫ్కో కలోల్‌ యూనిట్‌ ఉన్నతాధికారి ఇనాందార్, నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త, జీఎం రమేశ్‌ రాలియా తదితరులున్నారు. 

విస్తృతంగా వేరుశనగ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు 
రాష్ట్రంలో వేరుశనగ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. ఈ దిశగా అధ్యయనం కోసం అత్యధిక పరిశ్రమలు ఉన్న గుజరాత్‌లో పర్యటించి పరిశ్రమలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శనివారం గుజరాత్‌లోని సబర్‌కాంఠ జిల్లాలో పరిశ్రమలను బృందం సందర్శించింది. ఆఫ్లాటాక్సిన్‌ రహిత వేరుశనగ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉందని, తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. సీఎం కె.చంద్రశేఖరరావు సూచనల మేరకు జిల్లాల వారీగా పంట ఆధారిత ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top