ఐటీలో లక్షల జీతం వదిలి సాగుపై ఫోకస్‌.. రాజారెడ్డి సక్సెస్‌ స్టోరీ

Raja Reddy Cultivating Dragon Fruit Crop After Leaving IT Job - Sakshi

నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనం.. మల్టీ నేషనల్‌ కంపెనీలో గౌరవప్రదమైన ఉద్యోగం.. దుబాయ్‌లో ఆహ్లాదకరమైన జీవనం.. వీటన్నింటినీ వదులుకుని ఆయన స్వగ్రామంలో రైతుగా మారాడు. వ్యవసాయంపై మమకారంతో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచాడు.     

కర్నూలు(అగ్రికల్చర్‌): నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామానికి చెందిన బోరెడ్డి రాజారెడ్డి ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌(బీటెక్‌) పూర్తి చేశాడు. ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంటులో ఎంబీఏ కూడా చేయడంతో ఈయనకు దుబాయ్‌లోని ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా 2007లో ఉద్యోగం వచ్చింది. నెలకు రూ.4 లక్షల వేతనం ఇచ్చేవారు. 

కోవిడ్‌ సమయంలో ఈయన స్వగ్రామానికి వచ్చి, తనకున్న 24 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసేందుకు అధ్యయనం చేశాడు. డ్రాగన్‌ప్రూట్‌ సాగు లాభదాయకమని గ్రహించి,  గుజరాత్‌కు వెళ్లి మార్కెటింగ్‌ తదితర అంశాలను పరిశీలించి వచ్చాడు. మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి ప్రత్యేక ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించి, వ్యవసాయం మీదనే ఆసక్తి చూపాడు. ప్రయోగాత్మకంగా 2021 ఏప్రిల్‌లో నాలుగు ఎకరాల్లో డ్రాగన్‌ ప్రూట్‌ సాగుకు శ్రీకారం చుట్టాడు. ఈయన శ్రమ ఫలించి, సరిగ్గా 14 నెలలకు కాపు మొదలై, మొదటి పంటలోనే పెట్టిన పెట్టుబడిలో 90 శాతం దక్కింది. 

సాగు ఇలా.. 
డ్రాగన్‌ప్రూట్‌ సాగుకు మొదటి ఏడాది మాత్రమే పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉండి, రెండో ఏడాది నుంచి తగ్గుతూ వస్తుంది. ఎకరా తోటకు 500 సిమెంటు పోల్స్‌ పాతుకొని, వీటి పైన బండి చక్రం లేదంటే టైరు వంటివి ఏర్పాటు చేసుకోవాలి. అంట్లు తెచ్చుకోవడంతోపాటు డ్రిప్‌ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వీటి కోసం రాజారెడ్డి ఎకరాకు రూ.6 లక్షల ప్రకారం నాలుగు ఎకరాలకు రూ. 24 లక్షలు పెట్టుబడి పెట్టాడు. సీమామ్‌(ఎస్‌ఐఏఎం) రెడ్, థైవాన్‌ పింక్‌ రకాల అంట్లు ఒక్కొక్కటి రూ.100 ప్రకారం గుజరాత్‌ నుంచి తెచ్చుకుని, ఒక్కో సిమెంటు దిమ్మెకు 4 అంట్లు ప్రకారం ఎకరాకు 2,000 నాటుకున్నాడు. నాలుగు ఎకరాల్లో 8 వేల మొక్కలు అభివృద్ధి అయ్యాయి. డ్రాగన్‌ఫ్రూట్‌కు చీడపీడల బెడద ఉండదు. పశువులు తినే అవకాశం కూడా లేదు. బెట్టను తట్టుకుంటుంది. దిగుబడి పెంచుకోవడానికి, బరువు రావడానికి ఎరువులు మాత్రం ఇవ్వాల్సి ఉంది.  

దిగుబడి ఇలా.. 
2021 ఏప్రిల్‌లో అంట్లు నాటుకోగా సరిగ్గా 14 నెలల నుంచి అంటే ఈ ఏడాది జూన్‌ నుంచి కాపు మొదలైంది. గులాబీ రంగులో కాయలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పటి వరకు మొదటి పంటలో 16 టన్నులు దిగుబడి వచ్చింది. మరో టన్ను వరకు వచ్చే అవకాశం ఉంది. కాయ బరువు 400 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు ఉంటోంది. టన్ను సగటున రూ.1.30 లక్షల ధరతో విక్రయించగా రూ.20.80 లక్షలు వచ్చాయి. మరో టన్ను పంట చెట్లపై ఉంది. మొత్తంగా మొదటి పంటలోనే రూ.22 లక్షల ఆదాయాన్ని రాజారెడ్డి పొందారు. పెట్టుబడి రూ.24 లక్షల పెట్టగా,  మొదటి పంటలోనే 90 శాతం పెట్టుబడి వచ్చింది. డ్రాగన్‌ ప్రూట్‌ 30 ఏళ్లపాటు కాపు వస్తుంది. మొదటి ఏడాది మినహా రెండో ఏడాది నుంచి పెట్టుబడి వ్యయం ఎకరాకు గరిష్టంగా రూ.50 వేల వరకు మాత్రమే వస్తుంది. క్రమంగా దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 

కెమికల్స్‌కు తావు లేకుండా  
డ్రాగన్‌ ప్రూట్‌ పోషకాలకు నెలవు. దీనిని చిన్నారుల నుంచి వయో వృద్ధుల వరకు తింటారు. కెమికల్స్‌ వాడకుండా ప్రకృతి వ్యవసాయం విధానంలో ద్రవ, ఘనజీవామృతం, పశువుల ఎరువులు, కంపోస్ట్‌ ఎరువులు మాత్రమే వినియోగిస్తూ డ్రాగన్‌ ప్రూట్‌ సాగు చేస్తున్నట్లు రైతు రాజారెడ్డి తెలిపారు. చెట్టుకు కాయలు ఎక్కువగా రావడం, బరువు ఎక్కువగా ఉండడం కోసం తగిన మోతాదులో రసాయన ఎరువులు వినియోగిస్తున్నట్లు చెప్పారు. దీంతో మొదటి పంటలోనే ఎకరాకు 4 టన్నులకుపైగా దిగుబడి వచ్చినట్లు రాజారెడ్డి వివరించారు. 

ఎంతో సంతోషంగా ఉంది 
డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు విజయవంతం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరింత పట్టుదలతో పనిచేసే అవకాశం వచ్చింది. ట్రీపుల్‌ఈ, ఎంబీఏ పూర్తి చేసి 13 ఏళ్లపాటు నెలకు రూ.4 లక్షల వేతనంతో దుబాయ్‌లో పనిచేశాను. ఎప్పుడూ ఇంత సంతృప్తి లేదు. ఎవరైనా డ్రాగన్‌ఫ్రూట్‌ సాగుకు ముందుకు వస్తే సహకరిస్తాను. తక్కువ ధరకే అంట్లు సరఫరా చేస్తాం. మిగిలిన మా పొలంలో పండ్లతోటలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. 
– బోరెడ్డి రాజారెడ్డి (91548 71980)    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top