ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 'అన్నొస్తున్నాడు' కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ధర్మాన ప్రసాదరావు అన్నారు.
అమరావతి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 'అన్నొస్తున్నాడు' కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ధర్మాన ప్రసాదరావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్సీపీ ప్రకటించిన తొమ్మిది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 'నవ్యాంధ్రకు నవరత్నాలు' పేరుతో రూపొందించిన పోస్టర్‌ను పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, పార్థసారధి, సజ్జల రామకృష్ణారెడ్డి,భూమన కరుణాకర్ రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను తెలియ చెప్పడానికి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నొస్తున్నాడు పేరుతో పాదయాత్ర త్వరలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రీనరీ సమావేశాల్లో ప్రకటించిన తొమ్మిది హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కరపత్రాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపడమే ప్రతిపక్షం బాధ్యత అని, చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు చేరవేస్తామన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన తొమ్మిది హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు 10 నుంచి 25 వరకూ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ వర్ధంతి, సెప్టెంబర్ 2నుంచి అక్టోబర్ 7వరకూ ప్రతిఇంటికి నవ్యాంధ్ర నవరత్నాలు కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఒక్కరినీ కలుస్తారని ధర్మాన తెలిపారు.