సాక్షి, హైదరాబాద్: ఇన్నేళ్ల తన రాజకీయంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం గట్టిగా కొట్లాడలేకపోయానని.. అందుకు ఆ కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి తరఫున శనివారం జనం బాట కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అంతకంటే ముందు.. గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించాక ఆమె మీడియాతో మాట్లాడారు.
‘‘తెలంగాణ అమరవీరుల కుటుంబాలను నేను క్షమాపణలు కోరుతున్నా. గతంలో నేను గట్టిగా కొట్లాడలేకపోయా. ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. నా జాగృతి జనం బాటలో అందరినీ కలుస్తా. 33 జిల్లాల్లో ఉన్న అన్ని వర్గాలను కలుస్తా’’ అని అన్నారామె.
తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారు. తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో? ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 అమరులు అయ్యారని అనేక సందర్భాల్లో చెప్పాం. అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయాం.
ఈ మొత్తంలో 580 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు,కొన్ని చోట్ల ఎంపీపీ, జెడ్పిటిసి టిక్కెట్లు వచ్చాయి. కానీ ఉద్యమకారులకు అనుకున్న మేర న్యాయం జరగలేదు. నేను మంత్రిగా లేకపోయినా ఎంపీగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అడిగాను. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేక పోయినందుకు నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని కవిత వ్యాఖ్యానించారు.


