సాక్షి, నంద్యాల జిల్లా: రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. రైతులకు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాదయాత్ర చేపట్టారు. అరటికి గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాపిలి మండలంలో క్షేత్రస్థాయిలో అరటి పంటలను బుగ్గన పరిశీలించారు.
హుసేనాపురం నుంచి డి.రంగాపురం వరకు ఆయన పాదయాత్ర చేపట్టారు. ప్యాపిలీ మండలంలో దాదాపు 4వేల ఎకరాల్లో రైతులు అరటి సాగు చేస్తుండగా.. గిట్టుబాటు ధరలేక గెలలను పొలాల్లోనే వదిలేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ డిమాండ్ చేశారు.
‘‘మొక్క జొన్నకు మద్దతు ధర 2400 ప్రకటించిన ప్రభుత్వం.. రైతుల దగ్గర నుంచి ఇంత వరకు కొన్న పాపాన పోలేదు. నాడు జగన్ ప్రభుత్వంలో రైతులకు సకాలంలో మద్దతు ధర, ఎరువులను అందించేవారు నేడు కూటమి ప్రభుత్వంలో అధ్వాన పరిస్థితి నెలకొంది. రైతుల బీమా కోసం ఏడాదికి దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు చేశాం. ప్యాపిలిలో రూ.50 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేయడం కోసం శాంక్షన్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇటుక కూడా వేయకుండా ఆపేశారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేసింటే నేడు దళారులు వచ్చి కొనుగోళ్లు జరిపేవారు.
రైతులను పట్టించుకోకుండా ఐటీ, ఆర్టిఫీషియల్ టెక్నాలజీ అంటూ రైతుల సమస్యలను గాలికి వదిలేశారు. గత ప్రభుత్వంలో అన్నీ సౌకర్యాలు, ఏర్పాట్లు కల్పించడంతో అరటి పంట రైతులు విదేశాలకు ఎగుమతులు చేశారని స్పష్టం చేశారు. ఇప్పటికైన కూటమి ప్రభుత్వం దిగొచ్చి రైతుల పక్షాన నిలబడి గిట్టుబాటు ధరలు కల్పించాలి. రైతులకు ఎప్పుడూ అండగా ఉంటాం, రైతుల కోసం పోరాటం చేస్తాం’’ అని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.


