టీడీపీ కార్యకర్తలే కొంగ దీక్ష అంటున్నారు : ధర్మాన

Dharmana Prasada Rao Fires on Chandrababunaidu - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచి పోయే విధంగా ఈనెల 9న ఇచ్చాపురంలో జరగనుందని వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వల్ల ఎటువంటి మార్పు రాష్ట్రంలో వచ్చిందో మళ్లీ వైఎస్‌ జగన్‌ పాద యాత్రతో అటువంటి మార్పే వస్తుందని తెలిపారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తి చేశామని సీఎం చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. తనకుతానుగా గొప్పవాడు అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. సింగపూర్ కంపెనీలతో పెట్టుకున్న అగ్రి మెంటులను పబ్లిక్ డొమైన్‌లో పెట్టగలరా అని నిప్పులు చెరిగారు.

'ధర్మపోరాట దీక్షను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొంగ దీక్ష అంటున్నారు. అవినీతిలో దేశంలోనే నుంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తయారు చేశారు. సమర్ధవంతమైన పాలన అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియదు. తెలుగుదేశం కార్యకర్తల జేబులు నింపేందుకే నీరు మీరు కార్యక్రమం పెట్టారు. మీ ప్రభుత్వంలో పని చేసిన ప్రధాన కార్యదర్శిలే బయటకు వచ్చి మీరు చేసిన అవినీతి గురించి చెబుతున్నారు. మొదటి విడత ఇల్లులకు బిల్లులు చేయకుండా ఇప్పుడు జన్మభూమిలో ఇల్లు మంజూరు అంటున్నారు, ఇది ప్రజలను మోసం చేయడం కాదా? ఆరోగ్యశ్రీ కి ఇప్పటికీ బిల్లులు చెల్లించలేని ముఖ్యమంత్రిది సమర్థవంతమైన పాలనంటరా ? ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నించే పరిస్థితి ఉంది.

వైఎస్‌ జగన్‌ కేంద్రాన్ని అడగడం లేదు అనడం ఎంతవరకు సమంజసం. ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించే ముందు చంద్రబాబును ప్రశ్నించాలి. రూల్స్ వ్యతిరేకంగా కేబినెట్‌లో తీసుకున్న అన్ని నిర్ణయాలను రేపు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే బయట పెడతాం. ఒక ప్రతిపక్ష నాయకుడు సుదీర్ఘ కాలం పాదయాత్ర చేస్తున్నారంటే ఆ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి నిదర్శనం' అని  ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top