9.50 లక్షల ఎకరాల్లో  గోదా‘వరి’!

Delta farmers are ready for the cultivation of rabi crops - Sakshi

రబీ పంటల సాగుకు డెల్టా రైతులు సన్నద్ధం 

83 టీఎంసీలు అవసరమని అంచనా.. నదిలో పెరిగిన సహజసిద్ధ ప్రవాహం

సాక్షి, అమరావతి: గోదావరి పరవళ్లు డెల్టా రైతుల్లో ఆనందోత్సాహాలను నింపుతున్నాయి. నదిలో సహజసిద్ధ ప్రవాహం పెరగడంతోపాటు సీలేరు, డొంకరాయి జలాశయాల్లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నందున ఈ ఏడాది గోదావరి డెల్టాలో రబీ పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జలవనరులశాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. గోదావరిలో సహజ సిద్ధ ప్రవాహం రూపంలో 46.5 టీఎంసీలతోపాటు సీలేరు, డొంకరాయి జలాశయాల్లో రాష్ట్ర వాటా కింద మరో 46.5 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. ఇందులో తాగునీటి అవసరాల కింద 7 టీఎంసీలతోపాటు  ప్రవాహ, ఆవిరి నష్టాలుగా మరో మూడు టీఎంసీలు పోయినా 83 టీఎంసీలతో గోదావరి డెల్టాలో రబీ పంటలకు పుష్కలంగా నీటిని అందించవచ్చని చెబుతున్నారు. 

నాడు నాలుగేళ్లు కష్టాలే..
2014 నుంచి 2018 వరకు రబీలో పంటల సాగు డెల్టాలో సవాల్‌గా మారింది. వర్షాలు సరిగా లేక గోదావరిలో నీటి లభ్యత తగ్గడం, సీలేరు, డొంకరాయి జలాశయాల్లో నీటి నిల్వలను సమర్థంగా వినియోగించుకోకపోవడం వల్ల నీటి కొరత ఏర్పడింది. ఫలితంగా రబీలో సాగు చేసిన పంటలు లక్షల ఎకరాల్లో ఎండిపోయాయి. గతంలో నీటి కొరతను ఆసరాగా చేసుకుని డ్రెయిన్లు, మురుగునీటి కాలువల నుంచి తోడి పంటలకు సరఫరా చేసినట్లు రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.

9.50 లక్షల ఎకరాలు సాగుకు సిద్ధం
గోదావరి జిల్లాల్లో ఖరీఫ్‌ పంట నూర్పిళ్లు పూర్తయ్యాయి. రబీలో సాగుకు ఈనెల 1 నుంచే అధికారులు నీటిని విడుదల చేస్తు న్నారు. ఉభయ గోదావరిలో విస్తరించిన డెల్టాలో 10,13,161 ఎకరాలకుగానూ 9.50 లక్షల ఎకరాల్లో ఈసారి రబీ పంటలు సాగు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

ధవళేశ్వరం.. కళకళ
- గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి బుధవారం 9,091 క్యూసెక్కుల ప్రవాహం రాగా డెల్టాకు 5,100 క్యూసెక్కులు విడుదల చేసి 3,991 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. గతేడాది ఇదే రోజు ధవళేశ్వరం బ్యారేజీలో ప్రవాహం 7,452 క్యూసెక్కులే కావడం గమనార్హం.
ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు నుంచి గోదావరిలోకి ఇప్పటికీ సహజసిద్ధ ప్రవాహం కొనసాగుతోంది.
గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం వల్ల డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో సహజసిద్ధ ప్రవాహం ద్వారా 46.5 టీఎంసీలు లభిస్తాయని అధికారుల అంచనా.
సీలేరు, డొంకరాయి జలాశయాల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉంది. ఇందులో ఏపీ జెన్‌కో (ఆంధ్రప్రదేశ్‌ జలవిద్యుదుత్పత్తి సంస్థ) వాటా ద్వారా రాష్ట్రానికి మరో 46.5 టీఎంసీలు లభిస్తాయి.
ఈ ఏడాది గోదావరిలో నీటి లభ్యత పెరగడం, రాష్ట్ర ప్రభుత్వం నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేస్తున్న నేపథ్యంలో రబీలో సాగుకు ఎలాంటి ఇబ్బంది లేదని గోదావరి డెల్టా సీఈ శ్రీధర్‌ ‘సాక్షి’కి చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top