ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలు వాడుకోవడానికి ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్ అనుమతి
కానీ అక్కడి నుంచి 148 టీఎంసీలను కావేరికి మళ్లించేలా ఎన్‌డబ్ల్యూడీఏ డీపీఆర్
ఇది ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమే అంటున్న సాగునీటిరంగ, న్యాయ నిపుణులు
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానానానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) రూపొందించిన డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక) బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉందని సాగునీటి రంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య 1978 ఆగస్టు 7న కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు.. ఇచ్చంపల్లి బాహుళార్ధక సాధక ప్రాజెక్టు చేపట్టి, దాని నుంచి 85 టీఎంసీలకు మించకుండా గోదావరి నీళ్లను వినియోగించుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు జస్టిస్ బచావత్ నేతృత్వంలోని గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. కానీ.. అక్కడి నుంచి 148 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి మళ్లించేలా ఎన్‌డబ్ల్యూడీఏ డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను 2021 మార్చిలో రూపొందించింది.
ఆ నీళ్లు కూడా ఉమ్మడి మధ్యప్రదేశ్ నేటి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఇంద్రావతి సబ్ బేసిన్‌లో కేటాయించి, ఇప్పటికీ వాడుకోనివేనని చెబుతోంది. అయితే, తమ కోటా నీటిని పూర్తి స్థాయిలో వాడుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, వాటిని కావేరికి మళ్లించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఛత్తీస్‌గఢ్ సర్కార్ పదే పదే స్పష్టం చేస్తోంది. అయినా ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టేలా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను ఒప్పించి, అవగాహన ఒప్పందంపై సంతకం చేయించడానికి ఎన్‌డబ్ల్యూడీఏ నాలుగున్నరేళ్లుగా సంప్రదింపుల జరుపుతోంది. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఈనెల 23న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కూడా ఇదే అంశంపై నిర్వహించిన సమావేశంలో తమ కోటా నీటిని వాడుకోవడానికి అనుమతించబోమని ఛత్తీస్‌గఢ్ తేల్చిచెప్పడమే అందుకు నిదర్శనం.
ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన ఇదీ..
ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై 87 మీటర్ల గరిష్ఠ నీటి మట్టంతో బ్యారేజీ నిర్మించి, అక్కడి నుంచి 148 టీఎంసీలను నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల(పెన్నా), అరణియార్ రిజర్వాయర్ మీదుగా కావేరికి తరలించేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఎన్‌డబ్యూడీఏ ప్రతిపాదించింది. ఇందులో ఆవిరి ప్రవాహ నష్టాలు పోను తెలంగాణకు 43.65, ఆంధ్రప్రదేశ్‌కు 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 15.90, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామన్నారు. దీని వల్ల 6,78,797 హెక్టార్లకు నీళ్లందించడంతోపాటు తాగునీటిని అందించవచ్చునని పేర్కొంది.
ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ఈ అనుసంధాన ప్రాజెక్టును చేపట్టడానికి అంగీకారం తెలపాలని గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్ పరిధిలోని తొమ్మిది రాష్ట్రాలు, పుదుచ్చేరితో ఎన్‌డబ్ల్యూడీఏ ఆరు దఫాలు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించింది. ఈ 148 టీఎంసీలు ఇంద్రావతి సబ్ బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించి వాడుకోనివేనని పేర్కొంది. రానున్న రోజుల్లో హిమాలయ, ద్వీపకల్ప నదుల అనుసంధానంలో భాగంగా గంగ–మహానదుల అనుసంధానం చేపడతామని, మహానది–గోదావరి అనుసంధానం చేపడతామని, గంగ నుంచి గోదావరికి జలాలను తరలిస్తామని, అప్పుడు ఛత్తీస్‌గఢ్ తన కోటా నీటిని వాడుకోవచ్చని పేర్కొంది. కానీ దీనికి ఛత్తీస్‌గఢ్ ససేమిరా అంటోంది.
ట్రిబ్యునల్ అవార్డు ఉల్లంఘనే..
గోదావరిపై ఇచ్చంపల్లి బహుళార్ధ సాధక బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 78.10, మహారాష్ట్ర 10.50, మధ్యప్రదేశ్ 11.40 శాతం చొప్పున భరించాలి. ఇచ్చంపల్లి బ్యారేజీ విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో మహారాష్ట్రకు 35 శాతం, మధ్యప్రదేశ్‌కు 28 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 27 శాతం చొప్పున పంపిణీ చేసుకోవాలి. వాటికి అదనంగా మహారాష్ట్ర 3, మధ్యప్రదేశ్ 4, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరో 5 టీఎంసీలను వినియోగించుకోవచ్చు. అంతకు మించి నీటిని వాడుకోకూడదని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరి ట్రిబ్యునల్ అవార్డు జారీ చేసింది. ఇప్పుడు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన మేరకు ఇచ్చంపల్లి నుంచి 148 టీఎంసీలు తరలిస్తే గోదావరి ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించినట్లేనని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


