దండోరా వేశారు.. దమ్మిడీ రాలేదు

Debt relief not seen in farmers accounts till now - Sakshi

రెండు వారాలు గడుస్తున్నా రైతు ఖాతాల్లో కనిపించని రుణ ఉపశమనం

దేశంలోనే నా నిర్ణయం చరిత్రాత్మకం
ఇప్పుడు చాలా రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకుని రుణ ఉపశమన పథకాన్ని ప్రకటిస్తున్నాయి. మూడో విడతకు రూ.3,600 కోట్లు ఇస్తున్నాం. 36.72 లక్షల ఖాతాలకు పది శాతం వడ్డీతో జమ చేస్తున్నాం. ఇంకా అవసరమైన, అర్హుౖలైన వారికి కూడా ఇస్తాం.. చివరి రైతు వరకు న్యాయం చేయడమే నా లక్ష్యం.
– ఈనెల 9న కర్నూలు జిల్లా తంగడంచ గ్రామం వద్ద సీఎం చంద్రబాబు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రుణమాఫీ మూడో విడత నిధుల కోసం లక్షలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు కూడా రైతుల ఖాతాలకు ఆ సొమ్ము జమ అయినట్లు సమాచారం లేదు. కృష్ణా జిల్లాలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు సహా కొన్ని బ్యాంకుల్లో నగదు జమ అయినట్లు చెబుతున్నా, అది వాస్తవం కాదని రైతులు వాపోతున్నారు. కేవలం రూ.3,600 కోట్ల నిధులు విడుదల చేయడానికి మూడు నాలుగు నెలలుగా కిందా మీదా పడుతుండటంలో ఆంతర్యం ఏమిటని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఆర్భాటంగా చెక్కు ఇచ్చిన చంద్రబాబు.. రైతులను ఎందుకిలా ఇబ్బందులపాలు చేస్తున్నారని నిలదీస్తున్నారు.

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు  తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రకాల పంట, బంగారు రుణాలను పూర్తిగా, బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ దస్త్రంపై తొలి సంతకం అంటూ హడావిడి చేసి కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. తద్వారా ఖాతాల వడపోత అంటూ పంట రుణాల వర్గీకరణ చేయించి.. ప్రతి రైతు కుటుంబానికి రూ.1.5 లక్షలు మాత్రమే అంటూ కోత వేశారు. మొత్తం రూ.87,612 కోట్ల రుణాలను కేవలం రూ.24,500 (10 శాతం వడ్డీతో సహా) కోట్లకు పరిమితం చేశారు. దీన్నయినా ఒక్కసారే ఇచ్చారా అంటే అదీ లేదు. ఐదు విడతలుగా ఇస్తామన్నారు. ఇస్తామన్న సమయానికి ఇవ్వకుండా, ఇచ్చినట్లు ఆర్భాటంగా ఊరూరా ప్రచారం చేసుకుంటున్నారు. 

తప్పు బ్యాంకులపైకి నెట్టేసే యత్నం
రుణమాఫీ మూడవ విడత నిధులు తమ ఖాతాల్లో జమ కాలేదని రైతుల నుంచి ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తుండటంతో తప్పును అధికారులు, బ్యాంకులపైకి నెట్టి వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిజంగా నిధులు విడుదల చేసి ఉంటే సమస్య ఎక్కడ ఉందో చూసి కాసులిచ్చే మార్గం సుగమం చేసేది. ప్రభుత్వం ఇచ్చిన బాండ్లతో అన్నదాతలు చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఈసడింపులకు గురవుతున్నారు. బ్యాంకు అధికారులు రుణ మాఫీ బాండ్లను కొన్నిచోట్ల కంప్యూటర్లలో నమోదు చేసుకుంటున్నా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతున్న పరిస్థితి లేదు. నిజానికి ఇప్పటికే ఈ నిధులు జమ కావాలి. అలవి మాలిన హామీ ఇచ్చి ప్రస్తుతం నానా తంటాలు పడుతున్న ప్రభుత్వం కాలయాపనే ఉద్దేశంగా రుణమాఫీ మూడో విడత నిధుల విడుదలను సాగదీస్తోందని రైతు సంఘాల నేతలు, రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. వాస్తవానికి మూడో విడత నిధుల కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.3,600 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ నిధులను ఇంత వరకు విడుదల చేయలేదు. 

వడ్డీకీ సరిపోని మాఫీ సొమ్ము 
బాబు అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో రైతుల రుణాలు రూ.87,612 కోట్లకు పైగా ఉన్నాయి. వాటిని పూర్తిగా మాఫీ చేయకపోవడంతో ఆ తర్వాత ఏటా రూ.14 వేల కోట్ల చొప్పున 4 ఏళ్లలో రూ.56 వేల కోట్లు వడ్డీ, అపరాధ వడ్డీగా రైతులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికి చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఖాతాలకు జమ చేసింది కేవలం రూ.11 వేల కోట్ల చిల్లర మాత్రమే. ఆ మొత్తం రైతులు చెల్లించిన వడ్డీ లో ఐదో వంతుకూ సరిపోలేదన్న మాట. ఇలా రైతులకు పంటల బీమా రాకుండా చేసింది. రైతుల్ని బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా నిలబెట్టింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం రూ.24,500 కోట్లను మాఫీ చేసినట్టు  ఘనంగా చెప్పుకుంటున్నారు.

చెబుతున్నదొకటి.. చేస్తోంది మరొకటి..
జూలైలోనే రైతు సాధికార సంస్థకు రూ.వెయ్యి కోట్లు జమ చేశామని, మరో రూ.16 వేల కోట్లను సెప్టెంబర్‌లో ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని జూలైలో వ్యవసాయ శాఖకు విడుదల చేసిన నిధుల కేటాయింపుల వివరాలే చెబుతున్నాయి. (జీవో ఆర్‌టీ నంబర్‌ 1567, 6 వపేజీ) ఆర్థిక సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విడగొట్టి ప్రతి మూడు నెలల కాలానికి ఎంతెంత కేటాయింపులు చేశారో ఓ పత్రాన్ని విడుదల చేస్తుంటారు. అలా విడుదల చేసిన దాని ప్రకారం తొలి త్రైమాసికానికి రుణ ఉపశమనానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రెండో త్రైమాసికానికి రూ.1,260 కోట్లు, మూడో త్రైమాసికానికి రూ.1,260 కోట్లు, చివరి త్రైమాసికానికి రూ.1,080 కోట్లు కేటాయించారు. ఈ లెక్కన చూసినా డిసెంబర్‌లోగా రూ.2,520 కోట్లు మాత్రమే విడుదల అవుతాయి.

కానీ ఆ సమయానికి వాస్తవంగా ఇవ్వాల్సింది రూ.3,600 కోట్లు. మార్చి నెలాఖరుకు కానీ ఈ మేరకు వచ్చే పరిస్థితి లేదు. ఈ లెక్కన చూసుకుంటే డిసెంబర్‌ వరకు రైతుల ఖాతాలకు నామమాత్రంగా కూడా నిధులు జమ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వం సర్ది చెప్పుకోవడానికి అన్నట్లు రూ.2,520 కోట్లను ఇచ్చినా అది కొందరికే అందుతుంది. అందరికీ జమ కావాలంటే మార్చి దాకా ఆగాల్సిందే. ఇవి గాక నాలుగు, ఐదు విడతల సొమ్ము ఇంకా రైతులకు అందాల్సి ఉంది.

పది రోజులైనా.. పైసా రాలేదు
గత శుక్రవారం (13వ తేదీ) నుంచి పాత కడపలోని ఎస్‌బీఐ చుట్టూ తిరుగుతున్నా.. సోమవారం ఉదయం ఎట్టకేలకు నా బాండ్‌ పత్రాన్ని బ్యాంకులో అప్‌లోడ్‌ చేశారు. దీంతో పాటు బాండ్, ఆధార్, పాస్‌పుస్తకం జిరాక్స్‌ కూడా ఇమ్మంటే ఇచ్చాను. బాండ్‌ ఒరిజినల్‌ మీద స్టాంప్‌ వేసిస్తూ 72 గంటల తర్వాత డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు నయా పైసా జమ కాలేదు. మళ్లీ బ్యాంకుకు వెళ్లి అడిగితే, ‘వస్తాయిలే పోవయ్యా.. మాకు రానిదే ఎక్కడి నుంచి ఇవ్వాలి’అని విసుక్కుంటున్నారు.
– పి.మల్లీశ్వరరెడ్డి, పాతగిరియపల్లి గ్రామం, పెండ్లిమర్రి మండలం, వైఎస్సార్‌ జిల్లా 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top