రిసార్టులు, పార్కుల్లో అలంకరణకు ఈత చెట్లను..

Dates Palm Trees Smuggling In West Godavari District - Sakshi

పార్కుల సుందరీకరణకు వినియోగం  

గీత కార్మికుల ఉపాధికి గండి

సాక్షి, పాలకొల్లు అర్బన్‌(పశ్చిమ గోదావరి) : ఈత చెట్లు ప్రకృతి సంపద. డ్రెయిన్‌ గట్లు, కాలువ గట్లు, ప్రభుత్వ స్థలాల్లో, బండిదారి పోరంబోకు స్థలాల్లో ఈత చెట్లు సహజ సిద్ధంగా పెరుగుతుంటాయి. వీటిని కొందరు చెట్ల వేళ్లతో సహా తవ్వేసి తరలించుకుపోతున్నారు. కొంతమంది సంపన్నుల గృహాల ముందు, రిసార్టులు, పార్కుల్లో అందంగా అలంకరణ కోసం వీటిని అక్రమంగా తవ్వుకుపోతున్నారు. చెట్టు వేళ్లతో తవ్వేసి పార్కుల్లో తిరిగి పాతడం వల్ల ఈతచెట్టు ఏపుగా పెరిగి కొత్త ఆకులతో అందంగా కనిపిస్తుంది. గల్ఫ్‌ దేశాల్లో ఇంటి ముందు ఖర్జూరం చెట్లు అందంగా కనిపిస్తుంటాయి. అదే మాదిరిగా స్వదేశంలో విదేశీ సంస్కృతికి అలవాటు పడిన కొందరు సంపన్నులు వారి గృహాల ముందు ఈత చెట్లను అందంగా అలకరించుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం అభివృద్ధి చేసే పార్కుల్లో సైతం ఈత చెట్లను ఆయా కాంట్రాక్టర్లకు విక్రయించి అక్రమార్కులు సొమ్ములు చేసుకుంటున్నారు. 

ఉపాధికి గండి
వేసవికాలంలో ఈత చెట్ల నుంచి కల్లు తీసి గీత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అలాగే యానాదులు, ఉప్పర్లు ఈతచెట్ల కొమ్మలను సేకరించి వాటి ఈనెల ద్వారా తట్టలు, బుట్టలు అల్లుకుని ఉపాధి పొందుతున్నారు. ఈత ఈనెలతో తయారు చేసిన తట్టలు, బుట్టలు రైతాంగానికి ఎంతో ఉపయోగపడే పరికరాలు. కాలువ గట్ల వెంబడి సహజ సిద్ధంగా పెరిగి చూపరులకు కనువిందు చేసే ఈతచెట్లు అక్రమార్కుల కంటపడడంతో అక్రమంగా తవ్వుకుపోతున్నారు. 

పట్టించుకోని అధికారులు
చెట్టు కొట్టాలంటే రెవెన్యూ అధికారి అనుమతి తీసుకోవాలి. అలాగే ఇరిగేషన్‌ పరిధిలో ఉన్న చెట్లకు ఇరిగేషన్‌ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇది ఇలా ఉండగా గీత కార్మికుల ఉపాధికి ఉపయోగపడే ఈతచెట్టును ఎక్సైజ్‌ శాఖ అధికారులు పరిరక్షించాలి. అయితే అటు రెవెన్యూ, ఇరిగేషన్, ఎక్సైజ్‌శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల పని సులువుగా సాగిపోతోందన్న విమర్శలు ఉన్నాయి. 

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
ఈతచెట్లను కొంతమంది ముఠాగా ఏర్పడి అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో మా ఉపాధికి గండి పడుతోంది. ఈతకల్లులో పోషక విలువలున్నాయి. చాలామంది ఈతకల్లు కావాలని అడుగుతుంటారు. అయితే ఈత చెట్లు అందుబాటులో ఉండక తాటి చెట్ల నుంచే ఎక్కువగా కల్లు తీసి విక్రయిస్తుంటాం. ఈత చెట్లను వేళ్లతో సహా తొలగించి వ్యాపారం చేసుకుంటున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 
–జి.నరసింహరావు, గీత కార్మికుడు, ఆగర్రు 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top