యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా
కాళ్లు విరిచి .. వాహనాల్లో కుక్కి తరలింపు
చిత్ర హింసలకు కన్నీరు పెడుతున్న పశువులు
రాత్రి వేళల్లో దర్జాగా సరిహద్దు దాటుతోన్న వైనం
పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోన్న అధికార యంత్రాంగం
వారం రోజుల క్రితం గుడిబండ సంతలో కనిపించిన దృశ్యమిది. ఒకే వాహనంలో ఇలా పదుల సంఖ్యలో మూగజీవాలను కుక్కి ఎక్కించారు. ఆ తర్వాత తలుపు మూసేసి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లారు. మేత లేదు.. నీరు లేదు..కనీసం నిలబడే చోటు లేదు. కానీ ఆ మూగజీవాలు ఇలా గంటల సమయం నరక ప్రయాణం చేయాల్సిందే. హిందూపురం, గోరంట్లలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. అయినా ఎవరికీ ఈ మూగవేదన పట్టడం లేదు.
సాక్షి, పుట్టపర్తి : వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో పాడిపశువులను ప్రతి ఒక్కరూ పూజిస్తారు. రైతులైతే వాటిపై ప్రేమ పెంచుకుంటారు. కుటుంబ సభ్యుల్లా చూస్తారు. సాగులో సాయంగా ఉండే వాటికి పూజలూ చేస్తారు. ఇక పాడి వట్టి పోయినా..వయసు మీదపడినా కబేళాలకు మాత్రం అప్పగించరు. కానీ కొందరు వ్యాపారులు తామూ రైతులమేనంటూ ముగజీవాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని కబేళాలకు తరలిస్తూ రూ.కోట్లు కూడబెడుతున్నారు. ఇలా వివిధ ప్రాంతాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన పశువులను అక్రమంగా వాహనాల్లో కుక్కి తరలిస్తున్నారు.
సరిహద్దులో.. జోరుగా అక్రమ రవాణా..
సత్యసాయి జిల్లాలోని 32 మండలాలకు గానూ 16 మండలాలకు కర్ణాటక సరిహద్దుగా ఉంది. ఆయా సరిహద్దు ప్రాంతాల్లో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా వాహనాల్లో పశువులను జిల్లా సరిహద్దులు దాటించి.. బెంగళూరు, పావగడ, చిత్రదుర్గం, తుమకూరు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొందరు వ్యాపారులు ఈ దందాను సాగిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు.
తెల్ల పశువుల్లో ఆవుల అక్రమ రవాణాపై నిషేధం ఉన్నా... కాసులకు కక్కుర్తి పడిన కొందరు ఈ దందాను ఆపడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో పశువులు తరలిస్తున్నారు. ఏ మాత్రం మానవత్వం లేకుండా ఇరుకు వాహనాల్లో కుక్కి.. కాళ్లు విరిచి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పశువుల అక్రమ రవాణా వాహనాలను జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు.
ఇక రైతులు కూడా వేసవి ఆరంభంలో తీవ్రమైన పశుగ్రాసం ఏర్పడుతుందనే భయంతో ముందుగానే పశువులను అమ్మేస్తున్నారు. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకున్న వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

రైతుల ముసుగులో..
పశువులు కబేళాలకు తరలించే ముఠా సభ్యులు అధికారులను సైతం బోల్తా కొట్టిస్తున్నారు. తాము కూడా రైతులమేనని, పెంచి పోషించుకునేందుకే పశువులను కొంటున్నామంటూ అబద్ధాలు అల్లి అన్నదాతల వద్ద మూగజీవాలను కొనుగోలు చేస్తున్నారు.
అనంతరం ఓ చోటకు చేర్చి అక్కడి నుంచి వాహనాల్లో సంతలు జరిగే ప్రదేశాలకు కొన్ని తరలించి మరికొన్నింటిని కబేళాల్లో విక్రయాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యవసాయంలో యంత్రీకరణ విప్లవం రావడం, గ్రాసం కష్టాలు వెంటాడటం వెరసి పశు సంపద నానాటికీ క్షీణించిపోతోంది. ఆ ముసుగులో గోవుల విక్రయం పెరిగిందని విశ్లేషకులు అంచనా.
నిబంధనలు గాలికి..
వాహనాల్లో పశువులు తరలించే విషయంలో నిబంధనలు తప్పక పాటించాల్సి ఉంటుంది. సుదూరు ప్రాంతాలకు పశువులను తరలించాల్సి వస్తే వ్యవసాయ, పాడి అవసరాల నిమిత్తం తరలిస్తున్నట్టు అధికారులతో అనుమతులు పొందాలి.
పశువులకు గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. పశువైద్య కిట్లు, గ్రాసం, వాహనంలో నిల్చునే వెసులుబాటు ఉండాలి. కానీ ఈ నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. రెండు పశువులు పట్టే వాహనంలో నాలుగు ఎక్కించి కుక్కేస్తున్నారు. గ్రాసం, నీరు అందించక పోవడంతో గంటల తరబడి నిల్చున్న పశువులు ఎండకు సొమ్ముసిల్లిపోతున్నాయి.
గత ప్రభుత్వంలో రైతులకు అండగా..
వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగడుగునా పాడి రైతులకు అండగా నిలిచారు. టీకాలతో పాటు టీఎంఆర్ గడ్డి, దాణ, గడ్డి విత్తనాలు ఉచితంగా అందించారు. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో పోషకులు విధి లేక కబేళాలకు విక్రయిస్తున్నారు.
తనిఖీలు ముమ్మరం
పశువుల అక్రమ రవాణాకు అడ్డకట్ట వేస్తాం. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాం. ఎవరైనా పశువులను నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తూ ఉంటే వెంటనే వాహనాలు సీజ్ చేయిస్తున్నాం. పశు సంపద అక్రమంగా తరలిపోకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నాం. పశువుల అక్రమ రవాణా గురించి ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. తగిన చర్యలు తప్పక తీసుకుంటాం. – సతీశ్ కుమార్, జిల్లా ఎస్పీ


