నరకయాతన

నరకయాతన - Sakshi

  • మహానగరం కకావికలం

  •  హుదూద్ దెబ్బకు ధ్వంసమైన విశాఖ

  •  ఎటు చూసినా మోడువారిన వృక్షాలు

  •  ఛిద్రమైన భారీ భవంతులు..షాపింగ్ మాల్స్

  •  రోడ్డున పడ్డ నిరుపేదలు-ఆస్పత్రుల్లో హాహాకారాలు

  •  కనుమరుగైన పర్యాటకం-స్తంభించిన జనజీవనం

  • పచ్చని విశాఖ మోడువారిపోయింది. తుపాను మిగిల్చిన శిథిలాల మధ్య శాపగ్రస్థలా నిల్చుంది. పచ్చని చెట్లతో పరవశింపజేసిన ఇళ్ల ముందు శ్మశాన నిశ్శబ్దం అలముకుంది. విద్యుద్దీపాలతో వెలిగిపోయిన మహా విశాఖ ఒక్క రాత్రిలో నిశీథి నగరిగా మారింది. గుక్కెడు మంచినీటికి నోచక ఎడారిని తలపిస్తోంది. పసిపిల్లాడి గొంతులో పాల చుక్కలు పోద్దామన్నా కష్టమవుతోంది. వాహనాల దాహం తీర్చే ఇంధనం కోసం యుద్ధాలు చేయాల్సి వస్తోంది. తలలు తెగిన సైనికుల్లా రోడ్డంతా పరచుకున్న విద్యుత్ స్తంభాలు... ఏళ్ల తరబడి ప్రాణవాయువు అందించి నేలకూలిన వృక్షరాజాలు... ఈ గాయాలు మానిపోవాలి. ‘పచ్చని’ జీవితం కోసం కొత్త ప్రయాణం మొదలుపెట్టాలి. చీకట్లో చిరు‘దీపం’ వెలిగించేందుకు సన్నద్ధమవ్వాలి. ప్రకృతి ప్రకోపానికి బలైపోయిన సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకూ ఇప్పుడందరిదీ ఇదే బాట. ఆత్మవిశ్వాసంతో రేపటి కోసం పాడుతున్నారు బతుకు పాట.

     

    సాక్షి, విశాఖపట్నం: పాలు లేవు, గుక్కెడు మంచి నీళ్లు లేవు, కూరగాయలు, నిత్యావసరాల ధరలు నింగినంటాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ఎప్పుడన్నది జవాబులేని ప్రశ్న. మహా విధ్వంసాన్ని సృష్టించి నిష్ర్కమించిన హుదూద్ తుఫాన్ చేసిన ఘోరం తో విశాఖ వాసుల దురవస్థ ఇది. తుఫాన్ వి రుచుకుపడటంతో అద్భుత దృశ్యం అంతర్థానమైంది..కమనీయ చిత్రం కనుమరుగైం ది..సుమనోహర

    శిల్పం శిథిల రాగం ఆలపిస్తోంది.అందాల నగరం క్షతగాత్రగా మారింది.



    హుదూద్ చేసిన పెనుగాయంతో కకావికలమైన విశాఖ మళ్లీ కోలుకోవాలంటే  దశాబ్దకాలంపైగానే పడుతుంది. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే..తలలు తెగిపడి  చెల్లాచెదురుగా పడిన భారీ వృక్షాలు..నేలకూలిన విద్యుత్‌స్తంభాలు..అడుగు తీసి అడుగు వేయడానికి అవకాశం లేని దుర్భర పరిస్థితి. రాకాసి గాలుల హోరుకు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైన నగర వాసులు శనివారం రాత్రి హుదూద్ పెను తుఫాన్ రేపిన ధాటికి సోమవారం నేలకూలిన పూరి గుడిసెలు, ధ్వంసమైన ఇళ్లను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.



    ప్రకృతి విలయతాండవానికి వందల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులుగా మిగిలారు. ఎంతమంది విగతజీవులయ్యారో అధికారులు సైతం తేల్చలేకపోతున్నారు. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో చిమ్మచీకట్లు అలముకున్నాయి. ఇక వేల కోట్లల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు. గ్రీన్‌సిటీ కాస్తా నేడు వేలల్లో నేలకూలిన మహా వృక్షాలతో  కళావిహీనంగా తయారైంది.



    పర్యాటకులను కట్టిపడేసే బీచ్ రోడ్డు కోతకు గురైతే వుడా, లుంబినీ వంటి పచ్చని పార్కులు శ్మశాన దిబ్బను తలపించేలా తయారయ్యాయి. విద్యుత్ స్తంభాలైతే మెలితిరిగిపోయి సర్పవిన్యాసాలే చేశాయి. ఇక అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చెందాల్సిన విశాఖ ఎయిర్‌పోర్టు అంద వికారంగా తయారైంది. గత వారం రోజులుగా హుదూద్ విధ్వంసంపై హెచ్చరించిన ప్రభుత్వం నిర్వాసితులను ఆదుకోవడంలో మాత్రంఘోరంగా విఫలమైంది. బాధితులు గుక్కెడు నీళ్లు కూడా దొరక్క అల్లాడిపోయారు.

     

    రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం



    రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఇక కోల్‌కతా-చెన్నయ్‌లను కలుపుతూ విశాఖ మీదుగా వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారి రూపురేఖల్లేకుండా పోయింది. కశింకోట-అగనంపూడిల మధ్య పలుచోట్ల కోతకు గురైంది. ఇక నక్కపల్లి మొదలు శ్రీకాకుళం వరకు జాతీయరహదారిపై మహావృక్షాలు నేలకొరగడంతో వేలాదిగా వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. సాయంత్రానికి ఈ రహదారిలో రాకపోకలను పాక్షికంగా పునరుద్ధరించగలిగారు.  



    విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో దీపావళి వెలుగులు విరజిమ్మాల్సిన మహానగరంలో చిమ్మచీకట్లు ఆవహించాయి. జనరేటర్లను ఇదే అదనుగా వేలల్లో దోపిడీ చేస్తున్నారని కోటేశ్వరరావు అనే వ్యక్తి వాపోయారు. నిత్యావసర ధరలు చుక్కలనంటాయి. పాలు..నీళ్లూ కూడా కరువ య్యాయి. పాలప్యాకెట్ రూ.50 నుంచి రూ.100ల వరకు విక్రయిస్తే భోజనం రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయించారు. వాటర్ బాటిల్స్ కూడా ఒక్కొక్కటి రూ.40లకు, ఐదురూపాయల బిస్కెట్‌ప్యాకెట్ రూ.20లకు విక్రయించారు.



    నగరంలో ఒక అరడజను వరకు బంకుల్లో మాత్రమే పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉండడంతో ఆ బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి కన్పించింది. జాతీయ, అంతర్జాతీయ పేరెన్నిక గల షాపింగ్ మాల్స్‌న్నీ తుక్కుతుక్కయ్యాయి. పర్యాటకరంగానికి పెట్టింది పేరైన విశాఖనగరం కళావిహీనంగా తయారైంది. జూపార్క్‌తో పాటు ఉడా, లుంబిని, శివాజీ, కైలాసగిరి, తెన్నేటి పార్కులు, వైశాఖి జల ఉద్యానవనం వంటి పర్యాటక ప్రాంతాలన్నీ చూడ్డానికే భయానకంగా తయారయ్యాయి.



    జూపార్కులో కూడా అదే పరిస్థితి. కైలాసగిరిలో రాళ్లు తప్ప చూడ్డానికి ఏమీ మిగల్లేదు. నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.  ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ట్రీ కటింగ్స్ చేస్తూ హైవేలో కుప్పకూలిన వృక్షాలను తొలగిస్తున్నప్పటికీ నేలకూలిన విద్యుత్ స్తంభాలు తొలగించే పరిస్థితి లేకపోవడంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై నరానికి వచ్చే  వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top