నరకయాతన

Daily Worker Strucked in House Top Roof Collapse Anantapur - Sakshi

పాత ఇళ్లు కూలుస్తుండగా ప్రమాదం

శిథిలాల మధ్య         ఇరుక్కుపోయిన కూలీ

రంగంలోకి దిగిన పోలీసు,     అగ్నిమాపక సిబ్బంది  

మూడు గంటల అనంతరం ప్రాణాలతో బయటకు

అనంతపురం, మడకశిర: మడకశిర పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో పాత ఇళ్ల కూల్చివేత సందర్భంగా కూలీపైకి గోడ కూలబడింది. శిథిలాల మధ్యన ఇరుక్కుపోయిన కూలీ దాదాపు మూడు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు శ్రమించి ఎట్టకేలకు అతడిని రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. అంబేద్కర్‌ సర్కిల్‌లో బుధవారం పాత భవనాల కూల్చివేత పనులకు కొందరు కూలీలు ఉపక్రమించారు. డ్రిల్లింగ్‌ మిషన్, సుత్తిల ద్వారా భవనాన్ని బద్దలుకొడుతున్నారు.

మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మెట్లపై ఉండి పని చేస్తున్న గుడిబండ మండలం ఎస్‌ఎస్‌ గుండ్లు గ్రామానికి చెందిన నాగప్ప అనే కూలీపైకి ఒక్కసారిగా పైకప్పు పడింది. మధ్యలో ఇరుక్కుపోయిన నాగప్ప ఎటూ రాలేని పరిస్థితి. ఓ వైపు భారీ బరువు ధాటికి నొప్పితో విలవిలలాడుతూ ఆర్తనాదాలు చేశాడు. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. జేసీబీలు, క్రేన్‌లు తెప్పించి తోటికూలీల సహకారంతో శిథిలాల తొలగింపు చేపట్టారు. మధ్యాహ్నం 3.30 తర్వాత నాగప్పను సజీవంగా బయటకు తీసుకొచ్చారు. కాళ్లు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆయన్ను హిందూపురం తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారని ఎస్‌ఐ గోపీయాదవ్‌ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top