12 మంది టీచర్లపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం | criminal actions of the 12 teachers | Sakshi
Sakshi News home page

12 మంది టీచర్లపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం

Sep 25 2013 5:00 AM | Updated on Aug 16 2018 4:36 PM

బోగస్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ వ్యవహారంలో 12 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ జిల్లా విద్యాశాఖను ఆదేశించింది.

సాక్షి, సంగారెడ్డి: బోగస్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ వ్యవహారంలో 12 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ జిల్లా విద్యాశాఖను ఆదేశించింది. లేని రోగాలకు వైద్య చికిత్సలు చేయించుకున్నట్లు వైద్య బిల్లులు సృష్టించి నిధులను కొల్లగొట్టిన వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏజీ కార్యాలయం జరిపిన ఆడిట్‌లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల సహకారంతో బోగస్ బిల్లులు సృష్టించి అక్రమంగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ నిధులను సొమ్ముచేసుకున్నట్టు తేలింది. చికిత్స జరిగినట్లు బిల్లుల్లో పేర్కొన్న తేదీల్లో సదరు ఉపాధ్యాయులు సెలవుల్లో ఉండాల్సి ఉండగా, విధులకు హాజరైనట్లు హాజరు పట్టికల్లో సంతకాలు చేసి ఉండడంతో ఈ బండారం బయటపడింది.
 
 ఏజీ ఆడిట్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్  శాఖలతోపాటు పాఠశాల విద్యాశాఖ అంతర్గతంగా విచారణ జరిపాయి. ఈ క్రమంలో జిల్లాలో 12మంది ఉపాధ్యాయులు అడ్డంగా దొరికిపోయారు. సిద్దన్నపేట(నంగనూరు) ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ ఎం. వెంకటి రూ.1,70,586, పీర్లపల్లి(జగదేవ్‌పూర్) ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ పి.రాజేశ్వరి రూ.1,73,055, నల్టూరు(జిన్నారం) ప్రాథమికోన్నత పాఠశాల ఎస్‌జీటీ  కె.శశిధర్  రూ.21,218, మోటకింది తండా(మెదక్) ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ పి.శశికుమార్ రూ.19,598, జానకంపేట్(పటాన్‌చెరు) ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ పి.రామనరసింహరెడ్డి రూ.20,959 వైద్య బిల్లులను అక్రమంగా సొమ్ము చేసుకున్నారు.
 
 అదేవిధంగా కుసంగి(టేక్మాల్) జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు కె.కృష్ణారెడ్డి రూ.19,743, హంసాన్ పల్లి (కొల్చారం) జడ్పీహెచ్‌ఎస్ ఎస్‌ఏ ఎం.శ్రీనివాస్ రూ.21,852, సదాశివపల్లి(కౌడిపల్లి) ప్రాథమికోన్నత పాఠశాల ఎస్‌ఏ ఈ.యాదగిరి రూ.43,735, లక్ష్మాపూర్(రామాయంపేట) జడ్పీహెచ్‌ఎస్ ఎస్‌ఏ డి.దయానందరెడ్డి రూ. 22,392, రాంచంద్రాపురం జడ్పీహెచ్‌ఎస్ ఎస్‌ఏ బి.కృష్ణాగౌడ్ రూ.21,595, రంగంపేట్(కొల్చారం) జడ్పీహెచ్‌ఎస్ ఎస్‌ఏ సయ్యద్ అజీజ్‌అలీ రూ. 19,562, మెదక్ ఉన్నత పాఠశాల(కొత్త) ఎస్‌ఏ సయ్యదా అస్మాషాహీన్ రూ. 21,664 అక్రమంగా పొందినట్లు అప్పట్లో రుజువువైంది. 2010లో జరిగిన ఈ విచారణ అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతోపాటు వందలమంది సస్పెండయ్యారు.
 
 వైద్య బిల్లుల రికవరీలూ అప్పట్లో చేపట్టారు. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ ఉపాధ్యాయులపై ఆరోపణలు నమోదు చేశారు. బాధ్యులైన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని అప్పట్లో ప్రభుత్వం విద్యాశాఖకు సూచించింది. దీంతో జిల్లాలో బాధ్యులైన 12మందిపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నియమావళి అనుబంధం-1లోని ఆర్టికల్ 300నుంచి 302ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టాలని డీఈఓను ఆదేశిస్తూ పాఠశాల విద్యశాఖ కమిషనర్, డెరైక్టర్ వాణీమోహన్ ఈనెల 21న ఉత్తర్వులు జారీ చేశారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఫారసుల మేరకు ఐపీసీ 403, 409, 129(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు సదరు ఉపాధ్యాయులపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement