క్రికెట్‌ బెట్టింగ్‌తో కూలుతున్న జీవితాలు

Cricket Bettings In PSR Nellore - Sakshi

చెన్నూరులో అప్పులపాలై ఉరేసుకుని ఉద్యోగి మృతి

సంచలనం రేపిన ఘటన

గతంలోనూ ఇదే గ్రామంలో పలువురి ఆత్మహత్య  

నెల్లూరు, గూడూరు: క్రికెట్‌ బెట్టింట్‌ కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. కొంతకాలం క్రితం పోలీసు యంత్రాంగం బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపింది. దీంతో చాలావరకు తగ్గిందని అంతా భావించారు. అయితే సోమవారం గూడూరు రూరల్‌ మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పడాల సుధాకర్‌ అనే వ్యక్తి తన ఇంట్లోనే ఉరేసుకుని మృతిచెందాడు. దీనికి బెట్టింగ్‌ కారణమని బయటపడటంతో సంచలనమైంది.  

ఏం జరగిందంటే..
సేకరించిన సమాచారం మేరకు.. సైదాపురం పోస్టాఫీస్‌లో పనిచేస్తున్న సుధాకర్‌ బెట్టింగ్‌ కారణంగా సుమారు రూ.1.30 కోట్లు అప్పులపాలైనట్లు చెబుతున్నారు. బయటచేసిన అప్పులే కాకుండా పోస్టాఫీస్‌కు చెందిన రూ.12 లక్షల మొత్తాన్ని కూడా అతను బెట్టింగ్‌కు వాడేయడంతో విషయం బయటకు పొక్కి ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితి వచ్చినట్లు సమాచారం. దీంతో అతని బంధువులు ఆ మొత్తాన్ని చెల్లించినప్పుటికీ విషయం బయటకు తెలియడంతో మూడునెలల క్రితం సుధాకర్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు అతను చేసిన అప్పులు తీర్చేందుకు బెట్టింగ్‌నే మార్గంగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో మరింత అప్పులపాలయ్యాడు. ఇతని భార్య ఉపాధ్యాయురాలు కాగా, ఆమె చేత కూడా లోన్లు పెట్టించి అప్పులు తీసుకుని ఆ మొత్తాలను కూడా బెట్టింగ్‌ల్లో పెట్టి పాగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో అతను ఊర్లో తిరిగితే అవమానాల పాలవుతామని, కొద్దిరోజుల క్రితం గూడూరులో కాపురం పెట్టాడు. మళ్లీ చెన్నూరుకు వచ్చి అప్పులవాళ్లకు కనిపించకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇకపై ఈ అవమానాలతో తట్టుకోలేమనే సోమవారం సాయంత్రం ఉరేసుకుని మృతిచెందాడు. సుధాకర్‌కు మూడో తరగతి చదువుతున్న కుమార్తె, 7వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు.

గతంలో పలువురు..
సుమారు మూడేళ్లక్రితం చెన్నూరు గ్రామానికి చెందిన పోలి శివయ్య అనే వ్యక్తి పాత ఇనుప సామాన్లు విక్రయించి జీవనం సాగించేవాడు. అతను కూడా క్రికెట్‌ బెట్టింగ్‌ కారణంగా అప్పులపాలై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన మట్టం మునీంద్ర కూడా బెట్టింగ్‌తో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం కూడా క్రికెట్‌ బెట్టింగ్‌ల్లో అప్పులపాలై ఆది అనే వ్యక్తి కూడా గూడూరులో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. గ్రామంలో అప్పులపాలై ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ఇంకా కొందరు బెట్టింగ్‌ను బాహాటంగానే కొనసాగిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు దృష్టిసారించాలని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top