
బెట్టింగ్ మాఫియా ఉచ్చులో చిక్కుకొని యువత విలవిల్లాడుతోంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారాలన్న అత్యాశతో కొందరు యువకులు శక్తికి మించి అప్పులు చేస్తున్నారు. కోటీశ్వరుల మాట అటుంచితే ఉన్న డబ్బులు పొగొట్టుకుని.. చేసిన అప్పులు గుదిబండలుగా మారి.. కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కల్పిస్తున్నారు. బందరులో గతంలో కొంత మంది అప్పుల బాధతో ఊరొదిలి వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. ప్రాణాంతక వ్యసనంగా మారిన క్రికెట్ బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారంటూ బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్(మచిలీపట్నం): మొన్న ఐపీఎల్ టీ–20 మ్యాచ్‌లు.. నిన్న చాంపియన్ ట్రోఫీ.. నేడు ఇండియా– వెస్టిండిస్ వన్డే మ్యాచ్‌లు.. టోర్నీ ఏదైతేనేం.. పోటీదారు ఎవరైతేనేం.. బుకీలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లాలో యువతే లక్ష్యంగా బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతోంది. దీనికి బానిసవుతున్న యువత అత్యాశకు పోయి అప్పులపాలవుతోంది.
ఇండియా – వెస్టిండీస్ మ్యాచ్‌లకుభారీ బెట్టింగ్‌లు..
వేసవిలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బందరులో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. అలాగే చాంపియన్ ట్రోఫీలో ఇండియా–పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లకు విపరీతంగా బెట్టింగ్ జరినట్లు సమాచారం. ప్రస్తుతం ఇండియా – వెస్టిండీస్ వన్డే మ్యాచ్‌లకు సంబంధించి బందరులో బుకీలు భారీ స్థాయిలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఈ çసిరీస్‌లో ఐదు వన్డే మ్యాచ్‌లు ఉండగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి.
విద్యార్థులే టార్గెట్..
ఈ వన్డే మ్యాచ్‌లకు సంబంధించి బుకీలు ఉద్యోగులు, విద్యార్థులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరి ఉచ్చులో పడి ఇప్పటికే అనేక మంది విద్యార్థులు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు సమాచారం. మ్యాచ్‌లు పోగొట్టుకుని కట్టిన పందెం డబ్బులు బుకీలకు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియకుండా బైక్‌లను సైతం బుకీల వద్ద ఉంచుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చేసిన తప్పులు తల్లిదండ్రులకు తెలియకుండా దాచి ఉంచేందుకు విద్యార్థులు బైక్‌లను తమ స్నేహితులకు ఇచ్చినట్లు అబద్దమాడుతూ బుకీలకు అప్పజెప్పుతున్నారు.
ఫ్యాన్సీ బెట్టింగ్..
ఇండియా – వెస్టిండీస్ వన్డే మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. సరాసరి మ్యాచ్ బెట్టింగ్‌లే కాకుండా ఫ్యాన్సీ బెట్టింగ్‌ల పేరుతో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఓవరులో ఎంత కొడతారు, ఎన్ని వికెట్లు తీస్తారు. ఎన్ని ఫోర్లు కొడతారు, సిక్సర్‌లు ఎన్ని కొడతారు వంటి అంశాలపైనా పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.
నిద్దరోతున్న నిఘా!
బందరులో క్రికెట్ బెట్టింగ్‌లు భారీ స్థాయిలో జరుగుతున్నా పోలీసులు బుకీల వైపు కన్నెత్తిచూడకపోవటం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఈ మ్యాచ్‌ల్లో పేరుమోసిన బుకీలతో పాటు ఒకప్పుడు బుకీల వద్ద పనిచేసిన అనేక మంది ఇప్పుడు నేరుగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.
ఉపేక్షించేది లేదు..
క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు. తక్షణమే అదుపులోకి తీసుకుంటాం. బుకీలపై మరింత నిఘా పెడతాం. పట్టుబడిన వారిపై కేసులు పెడతాం. ఎలాంటి సిఫార్సులను పట్టించుకుని ప్రసక్తేలేదు. –మహబూబ్‌బాషా, బందరు డీఎస్పీ