
ప్రొద్దుటూరు క్రైం : మట్కా.. క్రికెట్ బెట్టింగ్..పేకాట.. వ్యభిచారం ఇవి సమాజానికి చీడ పురుగుల్లాంటివి. వీటిని నిర్వహిస్తున్న.. ప్రోత్సహిస్తున్న వాళ్లెవరైనా, ఎంతటి వారైనా శిక్షించాల్సిందే. మట్కా, క్రికెట్ బెట్టింగ్ తదితర వ్యసనాలను మానుకోవాలని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ ‘పరివర్తన’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా జూదరుల్లో మార్పు తీసుకొని రావడానికి పోలీసులు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేశారు. జూదరులు, వారి కుటుంబ సభ్యులను కడపకు పిలిపించి ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ తీసుకున్న చర్యల వల్ల చాలా వరకు మట్కా జూదం తగ్గినట్లు కనిపిస్తోంది. కొందరు మాత్రం పోలీసుల ఆదేశాలను ఖాతరు చేయలేదు. దొంగచాటుగా తమ పని కానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. దాడుల మాటున కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఎస్పీ మెప్పు పొందేందుకు కొందరు పోలీసు అధికారులు మట్కా జూదం మానేసిన వారిని అరెస్టు చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.
నాలుగు రోజుల క్రితం పట్టుకెళ్లారు..
మట్కా నిర్వహిస్తున్నారనే కారణంతో ప్రొద్దుటూరులోని రామేశ్వరం, ఆర్ట్స్‌కాలేజి రోడ్డు తదితర ప్రాం తాల నుంచి 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు మట్కా రాసేవారు, ఇంకొందరు 4–5 ఏళ్ల కిందటే మట్కా జూదాన్ని మానుకున్న వారు ఉన్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసినా, విచారణకు తీసుకెళ్లేటప్పుడు అయినా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. ఒక వేళ తీసుకొని వెళ్లేటప్పుడు అది సా«ధ్యం కాకుంటే తర్వాతైనా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయాలి. అయితే ప్రొద్దుటూరు పోలీసులు మాత్రం ఈ నిబంధనను మరచినట్టు ఉన్నారు. 15 మందిని విచారణ పేరుతో తీసుకొని వెళ్లిన పోలీసులు వీరిలో ఏ ఒక్క కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. దీంతో తమ వాళ్లు ఎక్కడున్నారో అని వారు ఆందోళన చెందుతున్నారు.
మట్కా మానేసిన తమ వాళ్లను ఎందుకు శిక్షిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. కాగా ప్రొద్దుటూరు నుంచి తీసుకొని వెళ్లిన 15 మందిని కడపలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఉంచి నట్లు తెలుస్తోంది. మట్కా ఆడుతున్నట్లు అంగీకరించాలని వారిలో కొందరిని పోలీసులు బాగా కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం. రూ. 3–4 లక్షలు తీసుకొని వస్తే కేసులో పెడతామని, తర్వాత మిమ్మల్ని వదిలేస్తామని బెదిరిస్తున్నట్లు తెలిసింది. తప్పు చేస్తే కేసులు పెట్టుకోండి.. లేదంటే వదిలేయండి.. అంతేగానీ నాలుగైదు రోజులు స్టేషన్‌లో పెట్టుకొని చితక బాదడం ఏంటని వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. జిల్లా ఎస్పీ దృష్టి సారించాలని, మట్కా మానేసి సంఘంలో మర్యాదగా జీవిస్తున్న వారికి న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు.