కేజీ బేసిన్‌లో గ్యాస్‌ను రిలయన్స్ అక్రమంగా తరలించినట్లు జస్టిస్ షా కమిషన్ గత ఆగస్టు 31న కేంద్ర పెట్రోలియం శాఖకు నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు.
- సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్‌లోని గ్యాస్‌ను రిలయన్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అది ప్రజల సొమ్మని ఆ సంస్థ నుంచి నష్టపరిహారం వసూలు చేయాలని సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆదివారం లేఖ రాశారు. కేజీ బేసిన్‌లో గ్యాస్‌ను రిలయన్స్ అక్రమంగా తరలించినట్లు జస్టిస్ షా కమిషన్ గత ఆగస్టు 31న కేంద్ర పెట్రోలియం శాఖకు నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు.
ఏప్రిల్ 2009 నుంచి మార్చి 2015 వరకు రిలయన్స్ కంపెనీ రూ.10 వేల కోట్ల విలువ చేసే 1,100 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను అక్రమంగా విక్రయించినట్లు జస్టిస్ షా కమిషన్ విచారణలో తేలిందని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రులో మెగా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఆ ప్రాతంలో పర్యటిస్తున్న ఏపీ ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవితోపాటు మరో ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మరో ప్రకటనలో ఖండించారు.