భూసేకరణ విషయంలో రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు డి.నిర్మల పేర్కొన్నారు...
- కలెక్టరేట్ వద్ద జైల్‌భరోలో సీపీఐ నేతలు
మచిలీపట్నం (చిలకలపూడి) : భూసేకరణ విషయంలో రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు డి.నిర్మల పేర్కొన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా, జైల్‌భరో నిర్వహించారు. నిర్మల మాట్లాడుతూ భూసేకరణ విషయంలో రైతులను వేధింపులకు గురిచేసి వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బలవంతంగా భూములను లాక్కోవటం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం సీపీఐ నాయకులు కలెక్టరేట్ గేటు వద్ద నినాదాలు చేశారు. దీంతో పోలీసులు సీపీఐ నాయకులను అరెస్టు చేసి చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అఫ్జల్, పరుచూరి రాజేంద్రప్రసాద్, లింగం ఫిలిప్, జంపాన వెంకటేశ్వరరావు, గారపాటి సత్యనారాయణ, నర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.