పాతపట్నంలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు

COVID-19: Three Positive Cases in Pathapatnam Town - Sakshi

అష్ట దిగ్భందంలో పాతపట్నం

శ్రీకాకుళం బయల్దేరిన మంత్రి ఆళ్ల నాని

రేపు ఉదయం 10గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  జిల్లాలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో పాతపట్నంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు అవుతోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం హుటాహుటీన శ్రీకాకుళం బయల్దేరారు. జిల్లాలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో మంత్రి ఆళ్ల నాని ఆదివారం ఉదయం పది గంటలకు జిల్లా అధికారులు సమీక్ష జరుపుతారు. కాగా కరోనా అనుమానిత లక్షణాలున్న పాతపట్నం యువకుడికి జరిపిన పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినా, అతని కుటుంబ సభ్యులు ముగ్గురికి పాజిటివ్‌ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ... కాంటాక్ట్‌ వ్యక్తులను గుర్తించినట్లు తెలిపారు. (ఏపీలో కొత్తగా 61 పాజిటివ్‌ కేసులు)

ప్రయాణ చరిత్రతోనే అప్రమత్తం 
అనుమానితులుగా ఉన్న వారిలో తొలి వ్యక్తి ఢిల్లీ రైల్వేలో పనిచేస్తున్నారు. మార్చి 19న స్వస్థలానికి వచ్చారు. ఆయన  ఆయన ప్రయాణించిన రైళ్లలో మర్కజ్‌ మత ప్రార్థనలకు వెళ్లిన వారు ఉన్నట్టు అనుమానం. అందుకనే అధికారులు అప్రమత్తమై హోం క్వారంటైన్‌లో పెట్టారు. 28 రోజులు దాటాక ఆ వ్యక్తి బయటికి రావడం మొదలు పెట్టారు. దీన్ని గమనించిన అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తగా పాతపట్నం సీహెచ్‌సీలో శాంపిల్స్‌ తీశారు. ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహించగా ‘డిటెక్టెడ్‌ వెరీ లో’ అని వచ్చింది. పూర్తి స్థాయి నిర్ధారణ కోసం జెమ్స్‌లో స్వాబ్‌ తీసి కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాల వైరాలజీ ల్యాబ్‌కు గురువారం పంపించారు. (కరోనా : ప్రాణం తీసిన అభిమానం )

ఈ పరీక్షల్లో నెగటివ్‌ రావడంతో కొంత టెన్షన్‌ తొలగినా ఆ వ్యక్తి కుటుంబానికి చెందిన మరో ముగ్గురికి కూడా ట్రూనాట్‌ కిట్‌ పరీక్షల్లో తనకు మాదిరిగానే ‘డిటెక్టెడ్‌ వెరీ లో’ అని వచ్చింది. దీంతో పూర్తి స్థాయి నిర్ధారణ కోసం వారి నుంచి స్వాబ్‌ తీసి కాకినాడ రంగరాయ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. శనివారం ఉదయానికి ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. మరోవైపు  అనుమానితుల గ్రామాల్లో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేశారు. 

27 గ్రామాలపై ఆంక్షలు
అనుమానిత వ్యక్తులు సంచరించిన సీది, కాగువాడ గ్రామాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న 27 గ్రామాలను అధికారులు దిగ్బంధం చేశారు. పాతపట్నం మండలంలోని సీది, తామర, తీమర, పాచిగంగుపేట, శోభ, రొంపివలస, రొంపివలస ఎస్సీ కాలనీ, పెద్ద సున్నాపురం, రొమదల, మాకివలస, కొరసవాడ, కాగువాడ, బూరగాం, పాతపట్నం, ప్రహరాజపాలెం, సీతారాంపల్లి, కోదూరు, బోరుభద్ర, శివరాంపురం, ఆర్‌ఎల్‌పురం, హిరమండలంలోని కల్లాట, కల్లాట కాలనీ, జిల్లేడుపేట, తంప, దనుపురం, సారవకోట మండలం నౌతల, కొత్తూరు మండలం జగన్నాథపురం గ్రామాల ను దిగ్బంధం చేశారు. 

కాగువాడ, సీది గ్రా మాల సరిహద్దులను పోలీసులు మూసివేశారు. ఈ రెండు గ్రామాల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు. పాతపట్నం నీలమణిదుర్గ కూడలి నుంచి సీదీ కూడలి, కమలమ్మకొట్టు కూడలి వరకు జాతీయ రహదారిని నిర్బంధించారు. నిత్యావసర సరుకులను అధికారులే డోర్‌ డెలివరీ చేస్తారు. పశువులకు దాణా సరఫరా చేస్తారు. మిగతా ముగ్గురి ఫలితాలు సానుకూలంగా వచ్చినట్టయితే ఆంక్షలు ఎత్తివేస్తారు. అనుమానిత వ్యక్తులతో కలిసి తిరిగిన సీది గ్రామానికి గ్రామానికి చెందిన 11 మంది, కాగువాడకు చెందిన ఏడుగురు, మాకివలస గ్రామానికి చెందిన నలుగురిని ముందస్తు జాగ్రత్తగా ఎచ్చెర్ల క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top