అద్దంకి కోర్టు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్య

Court field assistant suicide in Ongole - Sakshi

ఒంగోలు: అద్దంకి కోర్టులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ (అమీనా)గా పనిచేస్తున్న గుంజి వెంకటేశ్వర్లు (51) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాల్లోకెళ్తే... శనివారం రాత్రి పురుగుమందు డబ్బా పట్టుకుని కేకలు వేసుకుంటూ తాలూకా పోలీసుస్టేషన్‌కు వెంకటేశ్వర్లు చేరుకున్నాడు. స్టేషన్‌ ఆవరణలో ఉన్న కానిస్టేబుల్‌ కృపారావు అతడిని గమనించేలోపే కుప్పకూలిపోవడంతో ఆటోలో ఎక్కించుకుని హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌ వైద్యులు పరిశీలించి వెంకటేశ్వర్లు మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుని జేబులో రెండు రకాల ఫిర్యాదు కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 ఒక ఫిర్యాదు గుంటూరు జిల్లా ఎస్పీకి సంబంధించి మే 26న రాసుకున్న కాపీ కాగా, రెండోది శనివారం స్థానిక తాలూకా పోలీసులకు రాసుకున్నది. వాటిలోని సారాంశం ప్రకారం... 2015లో గుంటూరుకు చెందిన ఒక అడ్వకేట్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.10 లక్షలను గుంజి వెంకటేశ్వర్లు వద్ద తీసుకున్నాడు. ఉద్యోగాలు ఇప్పించకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, తదితర కారణాలతో వెంకటేశ్వర్లు కుటుంబంలో కలతలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్వర్లు అప్పుల బాధకు లోనై తనకు నెహ్రూకాలనీలో ఉన్న రూ.30 లక్షల విలువైన ఇంటిని అమ్ముకున్నాడు. దీంతో కుటుంబంలో కలతలు చెలరేగి భార్య కల్పన, కొడుకు మణిదీప్‌లు అతన్ని 2016లో కొట్టారు. 

అతను ప్రైవేటు ఆస్పత్రిలో వారంరోజుల పాటు ఉండి చికిత్స చేయించుకున్నాడు. కుటుంబంలో కలతలు పెరగడం సరికాదని భావించి కేసు కూడా పెట్టలేదు. కాగా, శనివారం మరోమారు భార్య, కుమారుడు అతన్ని వేధించి పోలీసుస్టేషన్లో కేసు పెడతామంటూ బెదిరించారు. దీంతో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఐ గంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రాథమికంగా తమకు అందిన సమాచారం మేరకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన అడ్వకేట్‌కు, బాధితులకు గుంజి వెంకటేశ్వర్లు మధ్యవర్తిగా ఉన్నాడా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియరావాల్సి ఉందన్నారు.

 నెలరోజుల కిందటే జిల్లా కోర్టు నుంచి అద్దంకి కోర్టుకు వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారని దర్యాప్తులో వెల్లడైందన్నారు. మృతుడి భార్య, కుమారుడు కేసు పెడతారేమోనన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మృతుడి భార్య, కుమారుడిని విచారించాల్సి ఉందన్నారు. మరణించిన గుంజి వెంకటేశ్వర్లు స్థానిక ఎన్‌జీవో కాలనీలో నివాసం ఉంటున్నాడని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top