
కోర్టుకు హాజరైన ‘బొమ్మరిల్లు’ డెరైక్టర్లు
అధిక వడ్డీలను ఆశ చూపి ఖాతాదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి కుచ్చు టోపి పెట్టిన విశాఖపట్నానికి చెందిన బొమ్మరిల్లు సంస్థ రీజనల్ డెరైక్టర్లను శుక్రవారం టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
నిలదీసేందుకు ప్రయత్నించిన బాధితులు
టెక్కలి,న్యూస్‌లైన్, అధిక వడ్డీలను ఆశ చూపి ఖాతాదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి కుచ్చు టోపి పెట్టిన విశాఖపట్నానికి చెందిన బొమ్మరిల్లు సంస్థ రీజనల్ డెరైక్టర్లను శుక్రవారం టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ విషయం తెలుసుకున్న టెక్కలి సమీప ప్రాంతాలకు చెందిన బాధితులంతా కోర్టు వద్దకు చేరుకుని డెరైక్టర్లను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. అయితే గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు డెరైక్టర్లను బాధితుల కంట పడకుండా గోప్యంగా కోర్టుకు తరలించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే...విశాఖపట్టణం ప్రధాన కేంద్రంగా ఉన్న బొమ్మరిల్లు సంస్థ అధిక వడ్డీలను ఆశ చూపి సామాన్యుల నుంచి కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టి సంస్థను మూసివేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్టణం రీజియన్‌కు చెందిన సంస్థ డెరైక్టర్లు బాబూజీ, యర్రయ్య, శ్రీనివాసరావు, వెంకట్రావు, నారాయణరావు తదితరులను కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిపై పలు పోలీసుస్టే షన్లలో కేసులు నమోదయ్యాయి. ఇదే క్రమంలో పలాస ప్రాంతానికి సంబంధించి కేసు విచారణకు విశాఖ పోలీసులు వారిని పలాస తీసుకెళ్లాలని శుక్రవారం భావించినప్పటికీ అక్కడ జడ్జి సెలవులో ఉండడంతో టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులంతా కోర్టు వద్దకు చేరుకుని వారిని నిలదీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కోర్టులో హాజరుపరిచిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ విశాఖ సెంట్రల్ జైలుకు తరలించడంతో బాధితులు చేసేదిలేక వెనుదిరిగారు.