వేటు పడింది

Corruption VRO And RI Suspend In East Godavati - Sakshi

‘బినామీ తమ్ముళ్ల స్వాహా పర్వం!’ కథనానికి స్పందన

ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అక్రమాలపై వీఆర్వో, ఆర్‌ఐ సస్పెండ్‌

నిర్వాసితులందరికీ న్యాయం చేస్తా : జేసీ మల్లికార్జున

ఆర్డీఓ సమక్షంలో నిర్వాసితులపై దాడికి యత్నం, తోపులాట.

మూడు ప్రత్యేక బృందాలతో సమగ్ర విచారణ

తూర్పుగోదావరి, తుని రూరల్‌ (తుని): పోలవరం ప్రధాన ఎడమ కాలువ నిర్వాసితులు కుమ్మరిలోవ కాలనీవాసుల ఆర్‌ఆర్‌ ప్యాకేజీలో అక్రమాలకు బాధ్యులైన ఆర్‌ఐ, వీఆర్వోలపై వేటు పడింది. సెప్టెంబరు పదిన ‘సాక్షి’లో ‘‘బినామీ తమ్ముళ్ల స్వాహాపర్వం!’’ శీర్షికన ప్రచురితమైన కథనం అప్పుడే తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు వీఆర్వో, ఆర్‌ఐలపై వేటు వేసి, బినామీ తమ్ముళ్ల స్వాహా పర్వానికి అడ్డుకట్టు వేశారు. మంగళవారం తుని మండలం కుమ్మరిలోవ వచ్చిన జాయింట్‌ కలెక్టర్‌ మల్లికార్జున బాధిత నిర్వాసితుల వాదనలు, అందించిన ఆధారాలను పరిశీలించారు. ప్రాథమికంగా అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి వీఆర్వో సాయిబాబా, ఆర్‌ఐ కార్తీక్‌ను సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మల్లికార్జున విలేకర్లతో మాట్లాడారు. ఆర్‌ఆర్‌ ప్యాకేజీ మంజూరైన జాబితాలో మొదట, చివరి పేజీలను ఉంచి, మధ్య పేజీల్లో పేర్లు మార్పు చేసి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించామన్నారు. ఉన్నత అధికారులను సైతం తప్పుదారి పట్టించినట్టు పేర్కొన్నారు. నిర్వాసితులు డిమాండ్‌ మేరకు అనర్హులుగా భావిస్తున్న 29 మంది పేర్లను తొలగించడంతో పాటు అర్హులైన మరో 65 మందికి న్యాయం చేసేందుకు సమగ్ర విచారణ చేస్తామన్నారు. ఇందుకుగాను వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు చొప్పున తహసీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్వోలతో మూడు ప్రత్యేక బృందాలను నియమిస్తామన్నారు. ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేస్తామన్నారు. డిసెంబరు నెలాఖరుకి పునరావాసం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి నిర్వాసితులకు అప్పగిస్తామన్నారు. సొంతంగా నిర్మించునే లబ్ధిదారుల ఇళ్లను పర్యవేక్షిస్తామన్నారు. పోలవరం కాలువ నిర్మాణం సకాలంలో పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఆర్డీఓ సమక్షంలో నిర్వాసితులపై దాడికి యత్నం, తోపులాట జాయింట్‌ కలెక్టరు వస్తుండడంతో కుమ్మరిలోవ కాలనీ నిర్వాసితుల పునరావాస కల్పన ప్రాంతానికి పెద్దాపురం ఆర్డీవో వసంతరాయుడు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న నిర్వాసితులను నష్టం ఎలా జరిగింది? ఇన్నాళ్లు ఎందుకు ఊరుకున్నారు? అంటూ ప్రశ్నించిన ఆర్డీఓ ఇరువర్గాలు అవగాహనకు వచ్చి రాజీపడండి, లేదంటే విచారణ చేస్తే అందరికీ నష్టం జరుగుతుందన్నారు. అప్పటికే చుట్టముట్టి ఉన్న బినామీ తమ్ముళ్ల ఒక్కసారిగా రెచ్చిపోయి బాధిత నిర్వాసితులపై దాడికి యత్నించారు. బాధితులుసైతం తిరగబడడంతో తోపులాట జరిగింది. దీంతో ఆర్డీఓ అక్కడి నుంచి దూరంగా వెళ్లి నిర్మాణంలో ఉన్న కట్టడాలను పరిశీలించారు. కొంతసేపటికి తోపులాట సద్దుమణగడం, అదే సమయానికి సంఘటన స్థలానికి జాయింట్‌ కలెక్టర్‌ మల్లికార్జున, బందోబస్తుకు రూరల్‌ పోలీసులు చేరుకున్నారు. బాధిత నిర్వాసితుల డిమాండ్లను, ఆరోపణలు విన్న జేసీ అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని, అర్హులకు విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరీకి నష్టపరిహారంతో పాటు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అందిస్తామన్నారు. వీఆర్వో, ఆర్‌ఐలను సస్పెండ్‌ చేసినట్టు ప్రకటించడంతో బాధిత నిర్వాసితులు శాంతించారు.

త్రుటిలో తప్పిన సస్పెన్షన్‌  
ఇళ్ల నిర్మాణం, ఆర్‌ఆర్‌ ప్యాకేజీ నివేదిక తయారీలో మొదట సంతకం చేసిన పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ సస్పెన్షన్‌ నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీఆర్వో, ఆర్‌ఐతో పాటు కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తున్నట్టు జేసీ మల్లికార్జున ప్రకటించారు. అక్కడే ఉన్న కార్యదర్శి సత్యనారాయణను వివరణ కోరారు. కార్యదర్శిగా చేరిన కొత్తలో ఈ వ్యహరం జరిగిందని, గ్రామ కమిటీ నివేదిక పేరుతో నా వద్ద సంతకాలు తీసుకున్నట్టు కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. అలా చేసిన సంతకాల నివేదికనే ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి పంపించడంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని, తన వాదనను కార్యదర్శి వినిపించాడు. దీనిని గమనించిన జేసీ తొలి తప్పిదంగా హెచ్చరించడంతో సస్పెన్షన్‌ వేటునుంచి కార్యదర్శి సత్యనారాయణ బయటపడ్డాడు.

జరిగింది ఇదీ...
పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం మండలంలో 18 కిలో మీటర్ల పొడవునా జరుగుతోంది. ప్రధానంగా కుమ్మరిలోవ కొండపై నుంచి తాండవ చక్కెర కర్మాగారం వెనుక కొండకు తాండవ నది అక్విడెక్టు నిర్మించాల్సి ఉంది. ఇందుకు కుమ్మరిలోవ కాలనీని ఆనుకుని ఉన్న కొండపై భారీ తవ్వకాలు చేయాల్సి ఉంది. భారీ తవ్వకాల్లో బండరాళ్లు ఎగిరిపడే ప్రమాదం ఉంది. అలా ఎగిరిపడే వచ్చే బండరాళ్లు కాలనీ ఇళ్లపై, ప్రజలపై పడితే ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో కుమ్మరిలోవకాలనీని తొలగించేందుకు ప్రతిపాదనలు చేశారు. కాలనీని తరలించేందుకు, నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ప్రతిపాదించారు. కాలనీలోఉన్న 315 ఇళ్లను తొలగించి, ప్రత్యామ్నాయంగా దుద్దికలోవలో పునరావాస కాలనీ నిర్మించనున్నారు. ఈ క్రమంలో 315 మంది బాధితుల పేర్లలో కొంతమంది పేర్లను తొలగించి, స్థానే బినామీ పేర్లను నమోదు చేశారు. నమోదు చేసిన పేర్లకు వచ్చే ఆర్‌ఆర్‌ ప్యాకేజీ రూ.మూడు కోట్లకుపైగా మొత్తాలను పంచుకునేందుకు పక్కా ప్రణాళిక వేశారు. ఈ అక్రమాన్ని వెలుగులోకి తెస్తూ సెప్టెంబర్‌ పదిన ‘సాక్షి’లో ‘పచ్చ రాబందులు, బినామీ తమ్ముళ్ల స్వాహాపర్వం! శీర్షిక న కథనాన్ని ప్రచురించింది. దీంతో గ్రామంలో కలకలం రేగింది. తమకు న్యాయంగా దక్కాల్సిన పరిహారాన్ని నాయకులు దోచుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కొంతమంది తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారానే తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో బాధిత నిర్వాసితులు ఎదురు చూస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top