రాజ్యసభ పోలింగ్‌ వాయిదా

Coronavirus: Rajya Sabha Polling Postponed - Sakshi

కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ నిర్ణయం 

రాష్ట్రంలో 4 స్థానాలకు పోటీలో ఐదుగురు

పునఃసమీక్షించాకే మళ్లీ తేదీల వెల్లడి  

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు ఈ నెల 26వ తేదీన జరగాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దేశం మొత్తం మీద కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే అభ్యర్థులు వేసిన నామినేషన్లు యథాతథంగా కొనసాగుతాయని, ఎన్నికల పోలింగ్, లెక్కింపును మాత్రమే వాయిదా వేస్తున్నట్లు కమిషన్‌ పేర్కొంది. 

- 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాల భర్తీకి మార్చి 6న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు అయిన మార్చి 18వ తేదీ అనంతరం పది రాష్ట్రాల నుంచి 37 మంది పోటీ లేకుండా ఎన్నికయ్యారు. 
- ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో 18 స్థానాలకు పోలింగ్‌ 26న జరగాల్సి ఉంది. 
- ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు 5 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గెలిచే అవకాశం లేకపోయినా.. ఓడిపోయే సీటును వర్ల రామయ్యకు ఇచ్చి టీడీపీ పోటీ చేయిస్తున్న విషయం విదితమే. 
- పోలింగ్‌ రోజున ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు, సహాయక అధికారులు, శాసనసభ్యులు గుమిగూడే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రజాప్రాతినిథ్య చట్టం–1951లోని 153 సెక్షన్‌ను అనుసరించి ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేసినట్లు కమిషన్‌ ప్రకటనలో తెలియజేసింది. పరిస్థితిని సమీక్షించిన తరువాత నిర్ణీత సమయంలో తర్వాత తేదీలను ప్రకటిస్తామని కమిషన్‌ పేర్కొంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top