కరోనా: ప్రాణాలతో ఆటలు!

Coronavirus: Neglected Hospital Docters In Anantapur District - Sakshi

నిర్లక్ష్యం వీడని  వైద్యఆరోగ్యశాఖ 

కురుగుంటలో వృద్ధుడి మృతి కలకలం 

పాజిటివ్‌ కేసు వార్డులోనే  వృద్ధునికి చికిత్స 

సాక్షి, అనంతపురం: కరోనా మహమ్మారి కట్టడికి అధికారులంతా అహరి్నషలు కృషి చేస్తున్నా.. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, సర్వజనాస్పత్రి కీలక వైద్యులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా 13కు చేరినట్లు తెలుస్తోంది. ప్రణాళిక లేకపోవడం.. పర్యవేక్షణ కొరవడటంతో సర్వజనాస్పత్రిలో కరోనా పాజిటివ్‌ కేసులకు చికిత్సలు ఇష్టానుసారంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందూపురం వాసి కరోనా బారిన పడి మృతి చెందగా.. అతనితో సన్నిహితంగా మెలిగిన వారిని పసిగట్టడంలో ఆరోగ్యశాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అందువల్లే పాజిటివ్‌ కేసులు కొత్తగా పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా అనంతపురం రూరల్‌ మండలంలో గురువారం 55 ఏళ్ల వ్యక్తి మృతి కలకలం రేపుతోంది. కరోనా బారిన పడి మృత్యువాత పడిన హిందూపురం వాసి అడ్మిషన్‌లో ఉన్న సమయంలోనే కురుగుంటకు చెందిన వృద్ధుడూ అక్కడే చికిత్స పొందాడనే ప్రచారం జరుగుతోంది. అతను ఈ నెల 7న సర్వజనాస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా... 8న మృతి చెందాడు. దీంతో అధికారులు హుటాహుటిన కురుగుంట గ్రామానికి వెళ్లి, అతను ఏవిధంగా చనిపోయాడన్నదానిపై ఆరా తీశారు. మృతుడు టీబీతో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలపడంతో.. మృతుని త్రోట్, న్యాసోఫ్యారింజిల్, తదితర నమూనాలను సేకరించారు.

మరోవైపు గురువారం కదిరి ఆస్పత్రిలో ఓ వ్యక్తి మృత్యువాత పడగా...కరోనా అనుమానంతో మృతదేహం నుంచి త్రోట్, న్యాసోఫ్యారింజిల్‌ తీశారు. అంతేకాకుండా ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బందికి పరీక్షలు చేయిస్తున్నారు. గురువారం ఉదయం ఆర్‌ఎంఓ, వైద్యులు, సిబ్బంది, రోగులకు మొత్తంగా 104 మందికి  కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.  

పాజిటివ్‌ కేసులన్నీ సవీరాకు తరలింపు  
కరోనా పాజిటివ్‌ కేసులన్నీ నగరంలోని కిమ్స్‌ సవీరాకు తరలించారు. సర్వజనాస్పత్రిలోని ఇద్దరు వైద్యులు, స్టాఫ్‌నర్సులు, హిందూపురానికి చెందిన పలువురిని సవీరాలో ఉంచి చికిత్సలు చేస్తున్నారు.

క్వారంటైన్‌కు మృతుల కుటుంబీకులు 
మరణానంతరం కరోనా పాజిటివ్‌గా తేలిన కళ్యాణదుర్గం మానిరేవుకు చెందిన వృద్ధుడి భార్య, పిల్లలను ఐసోలేషన్‌లో, 29 మంది బంధువులు, గ్రామ ప్రజలను క్వారన్‌టైన్‌(ఎస్‌ఆర్‌ క్వార్టర్స్‌లో) ఉంచారు. అలాగే గురువారం మృత్యువాత పడిన అనంతపురం రూరల్‌ మండలం కురుకుంటకు చెందిన వృద్ధుడి కుటుంబీకులు ఏడుగురిని ఆరోగ్యశాఖాధికారులు సర్వజనాస్పత్రిలోని ఐసోలేషన్, క్వారన్‌టైన్‌లో ఉంచారు. వీరందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.  

మాస్కులు అందక వైద్యసిబ్బంది అవస్థలు 
సర్వజనాస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో విధులు  నిర్వర్తించేందుకు ఈ నెల 8న రాత్రి డ్యూటీకి వచ్చిన స్టాఫ్‌ నర్సులు మాస్క్‌లు అందక గంటన్నరపాటు విధులకు దూరంగా ఉన్నారు. ఉన్నతాధికారులు  కల్పించుకుని మాస్క్‌లు అందించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top