ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వద్దు

Coronavirus: Cabinet Secretary Rajiv Gauba Conference with States CSs - Sakshi

రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ కాన్ఫరెన్స్‌

ఏప్రిల్‌ 14 వరకు మరింత కఠినంగా లాక్‌ డౌన్‌.. ప్రజలకు నిత్యావసరాలు అందేలా చూడండి

సరిహద్దుల్లో చిక్కుకున్న వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఆహారం, వసతి ఏర్పాటు చేయాలి

సాక్షి, అమరావతి: హెల్త్‌ ఎమర్జెన్సీ నేపథ్యంలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని, లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 14 వరకు మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఆదివారం ఢిల్లీ నుంచి రాజీవ్‌ గౌబ వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడంతో పాటు కేంద్రం రాష్ట్రాలకు జారీ చేస్తున్న మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేస్తున్నందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఇతర అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.

వివిధ రాష్ట్రాల సరిహద్దులు, జాతీయ రహదారులపై చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించాలి. ఇందుకోసం స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ నిధులను వినియోగించుకోవాలి.
నిత్యావసర వస్తువులు, సరుకులు రవాణా చేసే వివిధ రకాల వాహనాలకు ఎక్కడా ఆటంకం లేకుండా వాటి నిర్ధేశిత ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా చూడాలి. అలాగే ప్రజలందరికీ నిత్యావసరాలు సక్రమంగా అందేలా చూడాలి.
కోవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించిన చోట్ల తగిన సౌకర్యాలు పూర్తిగా అందుబాటులో ఉంచుకోవాలి. కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

పటిష్టంగా అమలు చేస్తున్నాం: సతీష్‌ చంద్ర
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర మాట్లాడుతూ.. ఏపీలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలను రైతు బజార్లు, మొబైల్‌ వ్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు వివరించారు. అలాగే ఒక్కో మనిషికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు వంటి రేషన్‌ సరుకులను 15 రోజులకు ఒకసారి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కర్ణాటకలోని కోలార్‌ నుంచి రాష్ట్ర సరిహద్దు చిత్తూరు జిల్లాకు చేరుకున్న 1,500 కూలీలకు సంబంధించిన అంశాన్ని ఆ రాష్ట్ర అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top