రూ.1,000 సాయం నేడే

Coronavirus: AP Govt Special Help To Poor People - Sakshi

1,30,00,000 కుటుంబాలకు రూ.1,300 కోట్లు

లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ప్రత్యేక సాయం

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ సాయం అందాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం

సాక్షి, అమరావతి: ఒకవైపు కరోనా వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే లాక్‌డౌన్‌ వల్ల పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. పేదలకు చేయూత అందించాలనే ఉద్దేశంతో వారికి ఉచితంగా బియ్యం, కందిపప్పుతోపాటు ఒక్కో కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ.1,000 చొప్పున నగదు ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి విడతగా గత నెల 29 నుంచి పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తున్నారు. నేడు (శనివారం) బియ్యం కార్డులున్న 1.30 కోట్ల కుటుంబాలకు ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా రూ.వెయ్యి చొప్పున నగదు సాయం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలందరికీ ఈ ప్రత్యేక సాయం అందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యం. ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే అర్హత పరిశీలించి వెయ్యి రూపాయల సాయం అందిస్తారు. 

► ఈ మేరకు బియ్యం కార్డులున్న కుటుంబాల జాబితాను సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులకు అందించినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు.  
► రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,300 కోట్లను సెర్ప్‌కు విడుదల చేసింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా నగదు పంపిణీపై అన్ని జిల్లాలకు సెర్ప్‌ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. 
► ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఈ నిధులను డ్రా చేసి గ్రామ సచివాలయ కార్యదర్శి... గ్రామ వార్డు కార్యదర్శులకు అందజేస్తారు. వీరు శుక్రవారం సాయంత్రానికి బియ్యం కార్డుల ఆధారంగా వలంటీర్లకు నగదు పంపిణీ చేశారు. 
► గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోపాటు వలంటీర్లు కూడా నేడు (శనివారం) కచ్చితంగా వి«ధుల్లో ఉండాలని ఆదేశించారు. 
► వలంటీర్లు శుక్రవారం సాయంత్రమే బియ్యం కార్డుదారుల ఇళ్లకు వెళ్లి నగదు సాయంపై సమాచారం ఇచ్చారు. 
► వలంటీర్ల మొబైల్‌ అప్లికేషన్‌లో బియ్యం కార్డు లబ్ధిదారుల వివరాల ఆధారంగా రూ.వెయ్యి చొప్పున నగదు అందజేయాలని పేర్కొన్నారు.    
► వలంటీర్లు భౌతిక దూరం పాటిస్తూ శనివారం ఉదయం 7 గంటల నుంచి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయాలి. పంపిణీ అనంతరం నగదు మిగిలితే రాత్రి 8.30 గంటలకు గ్రామ, వార్డు కార్యదర్శులకు అందజేయాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top