‘లాక్‌ డౌన్‌’ ఉల్లంఘిస్తే 6 నెలల జైలు

Coronavirus: AP Govt Actions On Violation Of Lockdown - Sakshi

ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే 

కొన్ని అత్యవసర సేవలకు మినహాయింపు  

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్రంలో ఈనెల 31వ తేదీ వరకు ‘లాక్‌ డౌన్‌’ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం ఆరు నెలల పాటు జైలుకు పంపించడంతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించే అధికారం సంబంధిత అధికారులకు కల్పించింది. లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉన్న సేవలు తప్ప మిగతావన్నీ ఆపేయాలని స్పష్టం చేసింది. 1897 అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని అమలులోకి తెస్తూ జీఓఆర్టీ నంబర్‌ 209 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఈనెల 31 వరకూ రాష్ట్ర మంతటా లాక్‌ డౌన్‌ ప్రకటించింది. 

మినహాయింపు సేవలు..  
- పోలీస్, వైద్య ఆరోగ్యం, పట్టణ స్థానిక సంస్థలు, అగ్నిమాపక, విద్యుత్, తాగునీరు, పురపాలక సేవలు, బ్యాంకులు, ఏటీఎం, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాలు 
- ఆహారం, సరుకులు, పాలు, బ్రెడ్, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపల రవాణా, గిడ్డంగులు, ఆసుపత్రులు, మందుల దుకాణాలు, కళ్ల జోళ్ల దుకాణాలు, ఔషధ తయారీ, వీటికి సంబంధించిన రవాణా.  
- టెలికాం, ఇంటర్నెట్‌ సేవలు, ఐటీ సేవకులు. 
- నిత్యావసర వస్తువుల తయారీ యూనిట్లు, వాటి సరఫరాదారులు, కరోనా నియంత్రణ కార్యకలాపాల్లో పాల్గొనే ప్రవేట్‌ సంస్థలు. 
- పెట్రోల్‌ పంపులు, ఎల్పీజీ గ్యాస్, ఆయిల్‌ ఏజెన్సీల రవాణా, గిడ్డంగుల్లో కార్యకలాపాలు. 
- ఆహారం, ఔషధాలు ,వైద్య పరికరాలు సరఫరా చేసే ఈ కామర్స్‌ సైట్లు. 
- జిల్లా కలెక్టర్‌ అనుమతితో ఇతరత్రా ఉత్పత్తి, తయారీ సంస్థలు  

మిగతా సేవలన్నీ 31 వరకు లాక్‌డౌన్‌ 
- అంతర్రాష్ట్ర రవాణా సేవలు సహా ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా రద్దు. 
- విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారందరూ 14 రోజుల పాటు కఠినమైన గృహ నిర్బంధంలో ఉండాలి. 
- వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం మూడు అడుగుల దూరం (సోషల్‌ డిస్టెన్స్‌) విధిగా పాటించాలి. 
- బహిరంగ ప్రదేశాలలో 10 మందికి మించి గుమిగూడటం నిషేధం.  
- రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల అమలు, పర్యవేక్షణ అధికారం జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, డీఎం అండ్‌ హెచ్‌ఓలు, సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలకు కట్టబెట్టింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top