అరట్లకోట ఉపాధ్యాయుడికి పాజిటివ్‌

Corona Positive to aratlakota Teacher in Visakhapatnam - Sakshi

తూ.గో. జిల్లా కత్తిపూడిలో సోకిన వైరస్‌

వేంపాడు ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న బాధితుడు  

చికిత్స కోసం కాకినాడ నుంచి విశాఖ విమ్స్‌కు తరలింపు

అప్రమత్తమైన అధికార యంత్రాంగం

నక్కపల్లి/పాయకరావుపేట రూరల్‌: పాయకరావుపేట మండలంలో అరట్లకోట గ్రామానికి చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి(40)కి కరోనా పాజిటివ్‌గా  తేలింది. కాకినాడలో ఇది నిర్థారణ కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని కాకినాడ నుంచి బుధవారం రాత్రి  విశాఖలోని విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. అరట్లకోట గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు నక్కపల్లి మండలం వేంపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నాడు. పాయకరావుపేట పట్టణంలో రాజుగారి బీడు ప్రాంతంలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో భార్యాపిల్లలను తూ.గో.జిల్లా కత్తిపూడిలోని అత్తవారింటికి పంపించాడు. మార్చి 25నుంచి పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఇతను కూడా కత్తిపూడి వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్న ఉపాధ్యాయుడికి వారం  కిత్రం జ్వరం, జలుబు తీవ్రంగా ఉండటంతో స్థానిక ఆర్‌ఎంపీ దగ్గర చికిత్స పొందాడు. తగ్గకపోవడంతో కాకినాడలో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు నిర్వహించి కరోనా అన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లగా అక్కడ పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని బుధవారం రాత్రి విశాఖలోని విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. 

ఎక్కడ సోకింది...  
అప్రమత్తమైన కత్తిపూడి వైద్య సిబ్బంది ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులతో పాటు ప్రాథమిక వైద్యం చేసిన ఆర్‌ఎంపీ వైద్యుడు, ల్యాబ్‌ టెక్నీషియన్‌లతో సహా 38 మంది నుంచి శాంపిళ్లు సేకరించి కాకినాడలోని క్వారంటైన్‌ వార్డుకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై బాధితుడి భార్యను సంప్రదించగా ప్రస్తుతం తాము విశాఖలోని విమ్స్‌ ఆస్పత్రిలో ఉన్నామన్నారు. కరోనా వైరస్‌ ఎక్కడ సోకిందనేది తెలియడం లేదని చెప్పారు.
పాయకరావుపేట: అరట్లకోటకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ గురువారం సాయంత్రం పాయకరావుపేటను సందర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top