సోమిరెడ్డి ఆచూకీ కోసం పోలీసుల అన్వేషణ

Cops Searching For Somireddy Chandramohan Reddy - Sakshi

సాక్షి, వెంకటాచలం (నెల్లూరు): వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో భూవివాదం కేసులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. ఇడిమేపల్లిలో సర్వే నంబర్‌ 58 – 3లో 2.41 ఎకరాల భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో సోమిరెడ్డి ఇతరులకు విక్రయించిన వ్యవహారంలో వెంకటాచలం పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో విచారణాధికారి వద్దకు హాజరుకావాలని, భూవివాదానికి సంబంధించి ఏమి డాక్యుమెంట్లు ఉన్నాయో సమర్పించాలని రెండు సమన్లను వెంకటాచలం ఎస్సై కరిముల్లా ఈ నెల ఆరున సోమిరెడ్డికి అందజేశారు. ఈ నెల తొమ్మిదిన వస్తానని చెప్పిన సోమిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లి తన తరఫున న్యాయవాదులను పంపడం, జిరాక్స్‌ పత్రాలను న్యాయవాదులు ఇవ్వడంతో రూరల్‌ సీఐ వాటిని తీసుకునేందుకు అంగీకరించలేదు.

ఈ క్రమంలో సోమిరెడ్డి బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులను జారీ చేయాలని ఆదేశించింది. వెంకటాచలం పోలీసులు బుధవారం హైదరాబాద్‌ వెళ్లగా సోమిరెడ్డి లేకపోవడంతో ఆయన నివాసానికి నోటీస్‌ను అంటించి వచ్చారు. కేసుకు సంబంధించి పోలీసులు అప్పట్లో సర్వేయర్‌గా పనిచేసిన సుబ్బరాయుడుతో పాటు సోమిరెడ్డి ఇద్దరు గన్‌మెన్లను గురువారం విచారించారు. సోమిరెడ్డి గుంటూరులో చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు అన్వేషణను ముమ్మరం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top