
సాక్షి, నెల్లూరు: జిల్లా సమీక్ష మండలి సమావేశం(డీఆర్‌సీ) సమావేశం రాజకీయ రగడకు దారి తీసింది. కరేడు రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడే ప్రయత్నం చేయగా.. మంత్రులు ఆనం, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి ఆయన్ని అడ్డుకుని అవమానకర రీతిలో మాట్లాడారు.
కరేడు రైతుల సమస్యపై బుధవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. కరేడులో భూ సేకరణపై వివరణ ఇవ్వాలని, ఎంత భూములు సేకరిస్తున్నారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రశ్నించారు. అయితే మాధవరావును మాట్లాడనీయకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో మీడియాపై చిందులేస్తూ బయటకు వెళ్లిపొమ్మంటూ ఊగిపోయారు.
ఆ సమయంలో మంత్రి ఆనం కలుగజేసుకున్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా.. ఎమ్మెల్సీకి అవకాశం లేదని, అవసరమైతే బయటకు వెళ్లిపోవాలని కటువుగా సూచించారు. ఆ సమయంలో మరో మంత్రి నారాయణ కూడా వేదిక మీదే ఉన్నారు. దీంతో మాధవరావు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు.
‘‘సమస్యలపై గళమెత్తడానికి రాజకీయ అనుభవం అవసరం లేదు. శాసనమండలి సభ్యుడుగా సమస్యలపై గళమెత్తడానికి నాకు హక్కు ఉంది. మంత్రి రామనారాయణరెడ్డి ఎమ్మెల్సీలు మాట్లాడేందుకు అర్హత లేదు అనడం హాస్యాస్పదంగా ఉంది. ఇండో సోల్ కంపెనీకి గతంలో మేము 5,000 ఎకరాల కేటాయించాము. ఈ ప్రభుత్వం 8,000 ఎకరాలు కావాలంటుంది. ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి
ఇటీవల రెండు గ్రామాల్ని తరలించేందుకు 2000 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. పచ్చటి పొలాలను గ్రామాలను కదిలించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. గ్రామాలకు గ్రామాలను పరిశ్రమల పేరుతో ఖాళీ చేయించడం ఘోరం. 3000 కుటుంబాలను పరిశ్రమల పేరుతో రోడ్డుకి ఈడ్చడం సబబు కాదు. ‘కరేడు రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుంది’’ అని అన్నారాయన.
