నా హత్యకు కీలకమంత్రి కుట్ర | conspiracy for my murder | Sakshi
Sakshi News home page

నా హత్యకు కీలకమంత్రి కుట్ర

Oct 5 2018 3:55 AM | Updated on Oct 5 2018 3:55 AM

conspiracy for my murder - Sakshi

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ‘ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి నా హత్యకు కుట్ర పన్నారు..రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న విజయవాడకు చెందిన రౌడీషీటర్‌తో హత్యచేయించేందుకు పథకం రచించారు.. ఇందుకోసం రూ.5 కోట్లతో మంత్రి ఒప్పందం కుదుర్చుకున్నారంటూ ముందడుగు ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది జె.శ్రవణ్‌కుమార్‌ ఆరోపించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శ్రవణ్‌కుమార్‌ గురువారం మీడియాతో మాట్లాడారు. ఐటీ కంపెనీల్లో రూ.25 వేల కోట్ల అవినీతి జరిగిందని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ వ్యక్తిగత ఆస్తుల మీద సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని తాను హైకోర్టులో గత నెలలో పిల్‌ వేశామని చెప్పారు.

ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న తనను హతమార్చేందుకు అసాంఘిక శక్తులతో కలిసి ప్రభుత్వం కుట్రపన్నినట్లు సమాచారముందన్నారు.  ఈ విషయమై బుధవారం విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశానని చెప్పారు. విచారణ జరిపించి, తనకు రక్షణ కల్పించాలని ఇంటెలిజెన్స్‌ అదనపు డెప్యూటీ జనరల్‌ను కోరానన్నారు.  తనకు ఏదైనా హాని జరిగితే సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.   కాగా, న్యాయపోరాటంలో భాగంగా భవిష్యత్‌లో చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై పూర్తి ఆధారాలు సేకరించి, హైకోర్టులో పిటిషన్‌ వేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement