
ఈ నెల 7న పురుగు మందు తాగిన బాధితుడు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి
కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ బెదిరించినట్లు సెల్ఫీ వీడియో
వరకట్న కేసులో వేధిస్తున్నారని ఆరోపణ
మృతుడి భార్య, అత్త, మధ్యవర్తులు, సీఐపై కేసు
చొప్పదండి/కరీంనగర్ క్రైం: గృహహింస, వరకట్న వేధింపుల కేసులో తనను అత్తింటివారితోపాటు మధ్యవర్తులు, కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ వేధిస్తున్నారని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 7వ తేదీన సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగిన కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన కడారి శ్రవణ్‌కుమార్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఈ వ్యవహారంలో చొప్పదండి పోలీసులు కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీలత, మృతుడి భార్య, అత్త, మధ్యవర్తులపై కేసు నమోదు చేశారు.
కరీంనగర్ రూరల్ రెవెన్యూ కార్యాలయంలో శ్రవణ్ కుమార్ రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కరీంనగర్ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి నీలిమతో 2021 జూన్‌లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. రెండేళ్ల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి నీలిమ తల్లిగారింట్లో ఉంటోంది. గత నెలలో కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో నీలిమ వరకట్నం వేధింపుల కేసు పెట్టడంతో శ్రవణ్‌తోపాటు, అతని తండ్రి నర్సింగం, తల్లి విజయ, అక్క కడారి వనజ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.
అక్కడ సీఐ శ్రీలత ‘నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి. నేను చెప్పినట్లు వింటే మంచిది. కంప్రమైజ్ చేసుకో. లేకుంటే ఇబ్బంది పడతావు’అని బెదిరిస్తూ అతడిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో సీఐ శ్రీలత, తన భార్య, అత్త, మధ్యవర్తుల వేధింపులు భరించలేకపోతు న్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రవణ్ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు.
శ్రవణ్ తండ్రి నర్సింగం ఫిర్యాదుతో సీఐ శ్రీలత, నీలిమ, ప్రవీణ్‌కుమార్, నవీన్‌కు మార్, ఎడ్ల ప్రసన్న, బత్తుల వినోద, బత్తుల మధుకుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌రెడ్డి తెలిపారు. శ్రవణ్ మృతితో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అతడి బంధు వులు ఆందోళన నిర్వహించారు. శ్రవణ్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.