జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ హడావుడి వేడెక్కుతోంది. ఇప్పటికే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ పరిస్థితిని అధిష్టానం దూత ప్రకాశ్ ఎల్గుల్వర్ సమీక్షించిన సంగతి తెలిసిందే.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ హడావుడి వేడెక్కుతోంది. ఇప్పటికే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ పరిస్థితిని అధిష్టానం దూత ప్రకాశ్ ఎల్గుల్వర్ సమీక్షించిన సంగతి తెలిసిందే. తాజాగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గ పరిశీలకుడు కేబీ కోలివాడ్ జిల్లాకు రానున్నారు. ఇప్పటికే ఆయన పర్యటన తే దీలు ఖరారు కావడంతో జిల్లా కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆసెంబ్లీ సెగ్మెంట్లవారీగా పార్టీ పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా స్థానిక నేతలతో సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా బలాబలాలు ప్రదర్శించి అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ సమీక్షపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇప్పటివరకు ఆయనపై ఉన్న అభిప్రాయాలను పరిశీలకుడికి వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల 19నుంచి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరీశీలకుడు కే బీ కోలివాడ్ గాంధీభవన్‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. 19వ తేదీన తాండూరు, వికారాబాద్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. 20వ తేదీన మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాలు, 21న పరిగి అసెంబ్లీ సెగ్మెంట్ పరిస్థితిని సమీక్షించనున్నారు. ఆ తర్వాత జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు మాజీ ఎంపీలు, శాసనసభ సభ్యులు, డీసీసీ మాజీ అధ్యక్షులు, జెడ్పీటీసీ మాజీ సభ్యులతో భేటీ కానున్నారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ షెడ్యూల్‌ను వెల్లడించారు.