ముంచుకొస్తున్న ముప్పు | Concern the situation in the reservoirs | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న ముప్పు

Jan 8 2016 12:27 AM | Updated on Sep 3 2017 3:16 PM

ముంచుకొస్తున్న ముప్పు

ముంచుకొస్తున్న ముప్పు

ఈసారి వేసవి పేరు చెబితే చాలు జీవీఎంసీ అధికారులు చమటలు పడుతున్నాయి.

ఏలేరులో అడుగంటిన జలాలు
ఇతర రిజర్వాయర్లలో పరిస్థితి ఆందోళనకరం
విశాఖ సిటీకి పొంచి ఉన్న వేసవి గండం
వచ్చేనెల నుంచే కష్టాలు మొదలు

 
విశాఖపట్నం  ఈసారి వేసవి పేరు చెబితే చాలు జీవీఎంసీ అధికారులు చమటలు పడుతున్నాయి. సిటీలో పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు అడుగంటుతుండడం వారిని కలవరపెడుతోంది. పైకి ఇబ్బంది లేదంటూ చెప్పుకొస్తున్న నీటిమట్టాలు మాత్రం భయపెడుతున్నాయి. జీవీఎంసీ జనాభా 22 లక్షల పైమాటే. నగరంలో తాగునీటి డిమాండ్ రోజుకు 85 మిలియన్ల గాలన్లు కాగా ప్రస్తుతం 68 మిలియన్ల గ్యాలన్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. సిటీ పరిధిలో పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన ప్రాజెక్టుల్లో ఏలేరు ప్రధానమైనది.

ఆ తర్వాత రైవాడ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి, గంభీరం, గోస్తని, ముడస ర్లోవ రిజర్వాయర్లు. ప్రస్తుతం వీటిలో నీటి నిల్వలు క్రమేపీ తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్టు సామర్ధ్యం 24.11 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 5.8 టీఎంసీలు మాత్రమే ఉంది. అది కూడా గోదావరి నుంచి లిఫ్టింగ్ చేస్తున్నారు. మరో పక్క గోదావరిలో కూడా ఇన్‌ఫ్లో తగ్గుతుండడంతో ధవళేశ్వరం రిజర్వాయర్ కింద నీటి నిల్వలు ఊహించని రీతిలో తగ్గుతున్నాయి. ఈ ప్రభావంతో మరో నెలరోజుల్లోనే ఏలేరులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉంది.

తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు ప్రస్తుతం ప్రతి రోజు గోదావరి నుంచి 100 క్యూసెక్కులు, ఏలేరు నుంచి 100 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. ఏలేరు జలాశయం నుంచి నగరానికి రోజుకు 130 మిలియన్ గ్యాలన్ల నీరు వస్తున్నప్పటికీ 60 ఎంజీడీల వరకు వృథాగా పోతుంది. ప్రజలకు సరఫరా చేసే నీటిలో ఐదారు మిలియన్ గ్యాలన్ల నీరు వృథాగా పోతుందని అంచనా. మరోపక్క విశాఖ సిటీకి తాగునీటి అవసరాలు తీర్చే మిగిలిన రిజర్వాయర్లలో కూడా నీటి మట్టాలు ఊహించని రీతిలో పడిపోతున్నాయి. ఇన్‌ఫ్లో లేకపోవడంతో మార్చిలో గోదావరిలో నీటి నిల్వలు మరింత తగ్గిపోయే అవకాశాలున్నాయని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు.

ఇప్పటికే శివారు గ్రామాల్లో వాటర్‌ట్యాంక్‌ల ద్వారా తాగునీరు రోజు ఒకపూట రావడం కూడా కష్టంగా మారింది. ఇక కుళాయిల ద్వారా రెండుపూటలా వస్తున్నా కొన్నిచోట్ల అరగంటకు మించి రావడం లేదు. సమస్యాత్మక ప్రాంతాలు గాజువాక, ఎండాడ, మధురవాడ, మారికవలస, బోయపాలెం, కొమ్మాది, పెందుర్తి, చినముషిడి వాడ, అడవివరం, సింహాచలం, దువ్వాడ, లంకెలపాలెం, దేవాడ, అప్పికొండ, అగనంపూడి, ఐటీ సెజ్, 58, 60, 69 వార్డులకు మంచినీటి సరఫరా విభాగం టౌన్ సప్లయి రిజర్వాయర్ నుంచి ట్యాంకర్ల ద్వారా రోజుకు 367 ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. 189 ఆటోల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జీవీఎంసీకి నీటిసరఫరా లారీలు నాలుగు ఉండగా, మరో 50 ట్యాంకర్లను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. ఏటా వేసవిలో 10 నుంచి 15 వరకు అద్దెకు తీసుకుంటుంటారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement