breaking news
Waterline
-
ముంచుకొస్తున్న ముప్పు
ఏలేరులో అడుగంటిన జలాలు ఇతర రిజర్వాయర్లలో పరిస్థితి ఆందోళనకరం విశాఖ సిటీకి పొంచి ఉన్న వేసవి గండం వచ్చేనెల నుంచే కష్టాలు మొదలు విశాఖపట్నం ఈసారి వేసవి పేరు చెబితే చాలు జీవీఎంసీ అధికారులు చమటలు పడుతున్నాయి. సిటీలో పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు అడుగంటుతుండడం వారిని కలవరపెడుతోంది. పైకి ఇబ్బంది లేదంటూ చెప్పుకొస్తున్న నీటిమట్టాలు మాత్రం భయపెడుతున్నాయి. జీవీఎంసీ జనాభా 22 లక్షల పైమాటే. నగరంలో తాగునీటి డిమాండ్ రోజుకు 85 మిలియన్ల గాలన్లు కాగా ప్రస్తుతం 68 మిలియన్ల గ్యాలన్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. సిటీ పరిధిలో పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన ప్రాజెక్టుల్లో ఏలేరు ప్రధానమైనది. ఆ తర్వాత రైవాడ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి, గంభీరం, గోస్తని, ముడస ర్లోవ రిజర్వాయర్లు. ప్రస్తుతం వీటిలో నీటి నిల్వలు క్రమేపీ తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్టు సామర్ధ్యం 24.11 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 5.8 టీఎంసీలు మాత్రమే ఉంది. అది కూడా గోదావరి నుంచి లిఫ్టింగ్ చేస్తున్నారు. మరో పక్క గోదావరిలో కూడా ఇన్ఫ్లో తగ్గుతుండడంతో ధవళేశ్వరం రిజర్వాయర్ కింద నీటి నిల్వలు ఊహించని రీతిలో తగ్గుతున్నాయి. ఈ ప్రభావంతో మరో నెలరోజుల్లోనే ఏలేరులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉంది. తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు ప్రస్తుతం ప్రతి రోజు గోదావరి నుంచి 100 క్యూసెక్కులు, ఏలేరు నుంచి 100 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. ఏలేరు జలాశయం నుంచి నగరానికి రోజుకు 130 మిలియన్ గ్యాలన్ల నీరు వస్తున్నప్పటికీ 60 ఎంజీడీల వరకు వృథాగా పోతుంది. ప్రజలకు సరఫరా చేసే నీటిలో ఐదారు మిలియన్ గ్యాలన్ల నీరు వృథాగా పోతుందని అంచనా. మరోపక్క విశాఖ సిటీకి తాగునీటి అవసరాలు తీర్చే మిగిలిన రిజర్వాయర్లలో కూడా నీటి మట్టాలు ఊహించని రీతిలో పడిపోతున్నాయి. ఇన్ఫ్లో లేకపోవడంతో మార్చిలో గోదావరిలో నీటి నిల్వలు మరింత తగ్గిపోయే అవకాశాలున్నాయని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే శివారు గ్రామాల్లో వాటర్ట్యాంక్ల ద్వారా తాగునీరు రోజు ఒకపూట రావడం కూడా కష్టంగా మారింది. ఇక కుళాయిల ద్వారా రెండుపూటలా వస్తున్నా కొన్నిచోట్ల అరగంటకు మించి రావడం లేదు. సమస్యాత్మక ప్రాంతాలు గాజువాక, ఎండాడ, మధురవాడ, మారికవలస, బోయపాలెం, కొమ్మాది, పెందుర్తి, చినముషిడి వాడ, అడవివరం, సింహాచలం, దువ్వాడ, లంకెలపాలెం, దేవాడ, అప్పికొండ, అగనంపూడి, ఐటీ సెజ్, 58, 60, 69 వార్డులకు మంచినీటి సరఫరా విభాగం టౌన్ సప్లయి రిజర్వాయర్ నుంచి ట్యాంకర్ల ద్వారా రోజుకు 367 ట్రిప్పులు సరఫరా చేస్తున్నారు. 189 ఆటోల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జీవీఎంసీకి నీటిసరఫరా లారీలు నాలుగు ఉండగా, మరో 50 ట్యాంకర్లను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. ఏటా వేసవిలో 10 నుంచి 15 వరకు అద్దెకు తీసుకుంటుంటారు. -
జలసిరి పదిలం
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలో భూగర్భ జలసిరి పదిలంగానే ఉంది. గతేడాదితో పోలిస్తే జనవరి చివరి నాటికి నీటిమట్టాలు స్వల్పంగా పెరగడం ఊరటనిస్తోంది. బండ్లగూడ,చార్మినార్, మారేడ్పల్లి, నాంపల్లి, శేరిలింగంపల్లి, సైదాబాద్, బహదూర్పురా, ఉప్పల్, బాలానగర్ మండలాల్లో నీటిమట్టాల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. మారేడ్పల్లి, మల్కాజ్గిరి, అమీర్పేట్ మండలాల్లో స్వల్పంగా నీటిమట్టాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేసవి ప్రారంభంలో విచ్చలవిడి బోరుబావుల తవ్వకాన్ని నియంత్రించడంతోపాటు పాతాళగంగను పొదుపుగా వాడుకుంటేనే మండువేసవిలో పానీపట్టు యుద్ధాలు తప్పుతాయని భూగర్భజల శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాగా మొత్తంగా గ్రేటర్ పరిధిలో గతేడాది జనవరి చివరి నాటికి 8.11 మీటర్ల లోతున భూగర్భ జల జాడ లభించగా.. ఈసారి 7.33 మీటర్ల లోతున పాతాళ గంగ ఆచూకీ లభించినట్లు భూగర్భ జలశాఖ తాజా నివేదిక వెల్లడించింది. అంటే గతేడాది కంటే 0.78 మీటర్ల మేర భూగర్భ జలసిరి పెరిగిందని తాజా నివేదిక వెల్లడించింది.