సమైక్యాంధ్ర ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోంది. జిల్లా వ్యాప్తంగా రాజకీయ, విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతమయ్యాయి.
మాచర్లలో పట్టణ బంద్ సంపూర్ణం.. ప్రశాంతం
Aug 6 2013 3:42 AM | Updated on Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు : సమైక్యాంధ్ర ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతోంది. జిల్లా వ్యాప్తంగా రాజకీయ, విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతమయ్యాయి. విభజనకు నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్లా మున్సిపల్ ఉద్యోగులు పెన్‌డౌన్ నిర్వహించారు. భారీగా ర్యాలీలు, మానవహారాలు చేశారు. గుంటూరులో నగరపాలక సంస్థ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా విధులు బహిష్కరించి అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఆటాపాటా కార్యక్రమంలో కబడ్డీ, కోకో ఆటలు ఆడారు. ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్‌లో యాచకుల నిరసన ప్రదర్శన, మానవహారం వినూత్నంగా జరిగింది. రాష్ట్ర విభజన చేయరాదంటూ బిచ్చమెత్తుతూ ప్రదర్శన చేశారు. అనంతరం యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ చిత్రపటాన్ని దహనం చేశారు. మాచర్లలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో చేపట్టిన పట్టణ బంద్ విజయవంతమైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో భారీగా ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని మూయించారు. గుంటూరు తూర్పు కన్వీనర్ నసీర్ అహ్మద్ నాయకత్వాన సంగడిగుంట సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. అదేవిధంగా ఏటుకూరు గ్రామస్తులు స్వచ్ఛందంగా తరలివచ్చి సమైక్యవాద నినాదం వినిపించారు. జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగి వాహనాల్ని నిలిపేశారు. సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏపీఎన్జీవో సంఘం పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది విధులు బహిష్కరించి కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ఎన్జీవో కల్యాణ మండపం వరకు భారీ నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం ఏర్పాటు చేసుకున్న సమావేశంలో సమైక్య ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. నల్లపాడులో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి కర్నూలు- హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై రాస్తారోకోకు దిగారు. నల్లపాడులో బ్యాంకులను మూయించారు.
ఏఎన్‌యూలో నిరసనలు..
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థుల జేఏసీ గుంటూరు, విజయవాడ హైవేపై రాస్తారోకో చే శారు. వర్శిటీ విద్యార్థులు మంగళవారం నుంచి నిరాహార దీక్షలకు ఉపక్రమించనున్నారు. సీమాంధ్ర విశ్వవిద్యాలయాల విద్యార్థుల జేఏసీ సమావేశం ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో జరగనున్నది. ఈ సమావేశానికి రాజకీయ, ప్రజాసంఘాల నేతలు హాజరుకానున్నారు. నిరసన కార్యక్రమాల భవిష్యత్ కార్యచరణపై మంగళవారం నాటి సమావేశంలో కీలకనిర్ణయం తీసుకోనున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్. శామ్యూల్ ప్రకటించారు.
చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విలేకరులు వేర్వేరుగా ఒక రోజు నిరాహారదీక్ష చేశారు. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి మానవహారం నిర్వహించారు. మంగళగిరి పట్టణంలో నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. రేపల్లెలో వ్యాపార, వాణిజ్యవర్గాలు బంద్ పాటించాయి. కోర్టు ఉద్యోగులు విధులు బహిష్కరించారు.
ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల జేఏసీ ఏర్పాటు..
రాష్ట్ర విభజనకు నిరసనగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల జేఏసీ ఏర్పాటైంది. మంగళవారం భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో మెడికల్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిపారు. సత్తెనపల్లి, చిలకలూరిపేట, తెనాలి, వినుకొండలలో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. సత్తెనపల్లిలో బ్రాహ్మణ ఐక్యవేదిక నేతలు లక్ష్మీగణపతి రుద్ర సహిత శాంతి హోమం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన చేయరాదంటూ చిన్నారులతో సోనియా చిత్రపటానికి దండం పెట్టించి, ప్రభుత్వ ఉద్యోగులకు గులాబీలు అందజేయించారు. తెనాలిలో ఆర్టీసీ అద్దెబస్సుల యాజమాన్యాలు అన్ని ప్రధాన వీధుల్లో బస్సులతో ర్యాలీ చేశారు. రాజీవ్ విద్యామిషన్ శిక్షణ తరగతులను ఆ శాఖ సిబ్బంది బాయ్ కాట్ చేశారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఏసీ మంగళవారం జిల్లాలోని అన్ని డీఈఈ కార్యాలయాల ముట్టడి గుంటూరు కేంద్రంలో ఎస్‌ఈ కార్యాలయ ముట్టడి చేపట్టనున్నట్లు పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement