కమిషనర్ శివనాగిరెడ్డి అరెస్టు | Commissioner sivanagi Reddy arrested | Sakshi
Sakshi News home page

కమిషనర్ శివనాగిరెడ్డి అరెస్టు

Aug 29 2014 12:54 AM | Updated on Oct 16 2018 6:08 PM

ఏసీబీకి పట్టుబడిన అమలాపురం మున్సిపల్ కమిషనర్ ఎ.శివనాగిరెడ్డిని గురువారం అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు.

 అమలాపురం టౌన్ :ఏసీబీకి పట్టుబడిన అమలాపురం మున్సిపల్ కమిషనర్ ఎ.శివనాగిరెడ్డిని గురువారం అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. బుధవారం ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు  సాయంత్రం  విచారణ జరిపారు. అక్కడ నుంచి  రాత్రి రాజమండ్రికి తరలించారు. అక్కడ కూడా విచారణ చేసి రాజమండ్రి త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. గురువారం ఉదయం విజయవాడ కోర్టుకు తీసుకువెళ్లారు. కమిషనర్‌ను అరెస్ట్ చేసి కోర్డులో హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ సీఐ రాజశేఖర్ ధ్రువీకరించారు.
 
 పనుల ఫైళ్లను తనిఖీ చేసిన ఆర్డీ
 కమిషనర్ ఏసీబీకి పట్టుబడటంతో రాజమండ్రి మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ (ఆర్‌డీ) రవీంద్రబాబు బుధవారం రాత్రి అమలాపురం మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. కమిషనర్ శివనాగిరెడ్డిని ఏసీబీకి పట్టించిన మున్సిపల్ కాంట్రాక్టరు అరిగెల బాబి మున్సిపాలిటీలో చేపట్టిన, చేపడుతున్న పనుల ఫైళ్లను పరిశీలించారు. ఇంజనీరింగ్ విభాగంలోని మొత్తం ఫైళ్లను తనిఖీ చేశారు. కాంట్రాక్టర్ తాను చేపట్టిన డ్రెయిన్ పనికి బిల్లు ఇవ్వటంలో కమిషనర్ ఇబ్బంది పెట్టడంతోపాటు లంచం అడిగారని, అందుకే ఏసీబీని ఆశ్రయించానని చెబుతున్న క్రమంలో ఆర్‌డీ రవీంద్రబాబు ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో ఆ పని తాలూకు ఫైలు కోసం ఆరా తీశారు. అది గల్లంతైనట్లు గుర్తించారు. ఇంజినీరింగ్ విభాగంలో లోపాలు ఉన్నాయని ఆయన గమనించినట్లు తెలిసింది.
 
 రిమార్కుతోనే బిల్లు నిలిపేశారా?
 డ్రెయిన్ పని ఫైలు గల్లంతులో ఇంజనీర్లదే తప్పిదంగా కనిపిస్తోంది. ఆ ఫైలును అటెండర్ ద్వారా గతంలో కమిషనర్‌కు పంపినప్పుడు తాను వెనకాలే ఉన్నానని కాంట్రాక్టరు చెబుతున్నారు. ఆ ఫైలుపై ఇంజనీర్లు రిమార్కు రాసినందువల్లే బిల్లు ఇవ్వటంలో జాప్యం చేశానని కమిషనర్ అంటున్నారు. కాంట్రాక్టరు బిల్లు కోసం కమిషనర్ వద్దకు పదే పదే తిరుగుతున్నప్పుడే ఆ ఫైలు కనిపించటంలేదని తేలింది. ఒక ఫైలు కనిపించకుండా పోవడానికి ఇంజనీరింగ్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇంజనీర్లు మాత్రం ఆ ఫైలును కమిషనర్ వద్దకు గతంలోనే పంపించేశామని చెబుతున్నారు. ఆర్డీ తన విచారణలో ఫైలు గల్లంతవడం ఇంజనీర్ల బాధ్యతారాహిత్యం గానే గుర్తించారు. దీనిపై పురపాలక శాఖ కమిషనర్ (డీఎంఏ)కు నివేదిక పంపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement