మాది ధర్మయుద్ధం | Commander Sagar of the Armed Forces in the woods with the media | Sakshi
Sakshi News home page

మాది ధర్మయుద్ధం

Sep 5 2013 5:54 AM | Updated on Apr 7 2019 4:30 PM

మాది ధర్మయుద్ధం - Sakshi

మాది ధర్మయుద్ధం

‘‘మాది ప్రజాపంథా. ధర్మయుద్ధం. నిరుపేదలకు భూమి దక్కేలా చూడడమే మా లక్ష్యం. ఇందుకోసం శ్రమిస్తాం. ఎంతకైనా తెగిస్తాం.

బయ్యారం అడవుల నుంచి ఎ.అమరయ్య, సాక్షి ప్రతినిధి: ‘‘మాది ప్రజాపంథా. ధర్మయుద్ధం. నిరుపేదలకు భూమి దక్కేలా చూడడమే మా లక్ష్యం. ఇందుకోసం శ్రమిస్తాం. ఎంతకైనా తెగిస్తాం. అందుకే ఆయుధాన్ని చేపట్టాం. దోపిడీ, పీడన లేని సమాజమే మా లక్ష్యం’’ అని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ 11 సాయుధ దళాల కమాండర్ సాగర్ స్పష్టంచేశారు. డిప్యూటీ కమాండర్లు గోపీ, సూర్యం, అశోక్‌లతో కలిసి ఆయన బయ్యారం అడవుల్లో మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజల కోసం చేత పట్టిన ఆయుధాన్ని దింపబోమని, ప్రజా విముక్తి పోరులో భాగమే తమ తుపాకీ అని సాగర్ స్పష్టం చేశారు. ‘సుదీర్ఘ సైద్ధాంతిక విభేదాలతో ఇమడలేక మితవాదులతో విడిపోయాం. పాటూరి ఆదినారాయణ స్వామి ఎలియాస్ చంద్రన్న కార్యదర్శిగా ఎన్నుకున్నాం. ప్రజాస్వామిక ఆకాంక్షల్ని నెరవేర్చడమే ప్రస్తుత గమ్యం’ అని చెప్పారు. రాయల సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని రాష్ట్ర కమిటీపై మండిపడ్డారు. బోస్, డీవీ కృష్ణ, వేములపల్లి వెంకట్రామయ్య (వీవీ) ఓ పథకం ప్రకారం పార్టీని కబ్జా చేసే ప్రయత్నించారు. సాయుధ దళాలను నిర్వీర్యం చేశారు. మితవాదులుగా మారి సీపీఐ, సీపీఎంలతో మిలాఖత్‌కు తాపత్రయపడ్డారని విమర్శించారు.
 
 వీళ్లు ముగ్గురూ సమైక్యవాదులు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించకూడదన్నదే వీరి వాదన. సాయుధ దళాల కొనసాగింపు వీరికి ఏ మాత్రం ఇష్టం లేదు. గిరిజన వ్యతిరేకమైన పోలవరం ప్రాజెక్టు కట్టాలన్నారు. గిరిజన భూ హక్కుకు సంబంధించిన 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చివరకు చంద్రన్నపై అవినీతి, ఆర్థిక ఆరోపణలు చేయడంతో ఇక లాభం లేదనుకుని తెగతెంపులు చేసుకున్నాం’ అని వివరించారు. ‘మాది నిజమైన పార్టీ...చండ్రపుల్లారెడ్డి, పైలా వాసుదేవరావుల స్ఫూర్తిని మేం కొనసాగిస్తాం. ఈ త్రికూటమి చిట్‌ఫండ్ వ్యాపారాలకు, చేస్తున్న పంచాయితీలకు వంతపాడుతున్న మధు, పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్‌లను ప్రజల ఎదుట దోషిగా నిలబెడతాం’ అని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల ఆకాంక్ష, తెలంగాణ వస్తే నక్సలైట్ల ప్రభావం పెరుగుతుందన్నది భ్రమ’ అని సాగర్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement