రంగురాళ్ల వేట మొదలైంది !

Colour Stones Hunting In Krishna - Sakshi

వజ్రాలు, రంగురాళ్లకు   ప్రసిద్ధిగాంచిన కృష్ణాతీరం

వర్షాలు కురవడంతో  గుడిమెట్లలో ముమ్మరంగా రంగురాళ్ల వేట

పొరుగు రాష్ట్రాల నుంచీ తరలివస్తున్న అన్వేషకులు

గుడిమెట్ల (నందిగామ): వజ్రాలు, రంగురాళ్లకు ఈ ప్రాంతం అత్యంత ప్రసిద్ధిగాంచింది. అనాది నుంచి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల, చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల (రామన్నపేట), కృష్ణాతీరం వజ్రాల గనిగా వాసికెక్కింది. మనసు పెట్టి అన్వేషణ సాగిస్తే, ఏదో ఒకటి దొరుకుతుందన్న నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. సాధారణరకం మొదలుకొని రూ.లక్షల విలువ చేసే వజ్రాలు లభ్యమైన సందర్భాలు అనేకం ఉండటమే ఇందుకు నిదర్శనం. అత్యంత ఖరీదైన కోహినూర్‌ వజ్రం కూడా పరిటాల చెరువులోనే లభించిందని ఓ కథనం ప్రచారంలో ఉంది.

కొనసాగుతున్న అన్వేషణ..
గుడిమెట్ల ప్రాంతంలో వజ్రాలు అధికంగా లభిస్తుండటంతో దశాబ్ధాల క్రితం చందర్లపాడులో వజ్రాల కర్మాగారం కూడా ఉండేది. రెండు దశాబ్ధాల క్రితం వరకు వజ్రాల వేట ముమ్మరంగా సాగేది. రాను రాను అన్వేషకుల సంఖ్య ఎక్కువ కావడంతో వీటి లభ్యత తగ్గిపోయింది. అయితే, ఇప్పటికీ ఆశావహులు తొలకరి జల్లులు కురిస్తే చాలు వజ్రాల వేటకు బయలుదేరుతారు. ఇందుకోసం వీరు ప్రధానంగా చందర్లపాడు మండల పరిధిలోని గుడిమెట్ల శివార్లలో కృష్ణానది ఒడ్డును ఎంచుకుంటారు. ఇక్కడే తవ్వకాలు అధికంగా సాగిస్తారు.

కొందరు ఏకంగా భోజనాలు సిద్ధం చేసుకొని వచ్చి మరీ అన్వేషణ సాగిస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేట కొనసాగించి చీకటి పడుతున్న వేళ ఇళ్లకు వెళ్లిపోతుంటారు. ఏటా తొలకరి జల్లుల సమయంలో ఇక్కడ వజ్రాల వేట ప్రారంభమవడం ఆనవాయితీ. పొరుగు జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి వజ్రాల వేట సాగిస్తుంటారు. ప్రతినిత్యం 200 మంది వరకు ఇక్కడ అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం. ఇక్కడ వజ్రాలతోపాటు రంగురాళ్లు కూడా అధిక సంఖ్యలో లభ్యమవుతాయి. దీంతో కూలి ఖర్చుకు ఢోకా ఉండదని చెబుతారు. కొందరైతే వర్షాకాలంలో ఏకంగా వజ్రాల వేట కోసమే గుడిమెట్ల గ్రామంలో ఇళ్లు అద్దెకు తీసుకొని నెలలపాటు అక్కడే నివాసముంటారని గ్రామస్తులు చెబుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top