కొత్త కలెక్టర్‌ వచ్చేశారు..

Collector Bhaskar Attend First Day in Visakhapatnam - Sakshi

నేడు బాధ్యతల స్వీకరణ

వచ్చీరాగానే పనిలో నిమగ్నం

సాక్షి, విశాఖపట్నం: విశాఖ కొత్త కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌ జిల్లాకు వచ్చేశారు. వచ్చిరాగానే ఒక్క క్షణం ఆలస్యంగా చేయకుండా పనిలో దిగిపోయారు. ఆదివారం మధ్యాహ్నం సర్క్యూట్‌ హౌస్‌కు చేరుకున్న కొత్త కలెక్టర్‌ భాస్కర్‌ను పాడేరు కలెక్టర్‌ జిల్లా రెవెన్యూ అధికారి సి.చంద్రశేఖరరెడ్డి, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి మల్లేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా గురించి వివరించారు. సోమవారం ఉదయం 10 గంటలకు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన జిల్లాలో ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

గ్రీవెన్స్‌కే ప్రాధాన్యం
సాక్షి, విశాఖపట్నం: గ్రీవెన్స్‌సెల్‌ ఎక్కడ నిర్వహిస్తారు? ప్రతి వారం ఎంతమంది అర్జీదారులు వస్తుంటారు? ఆ వచ్చే అర్జీలను ఏ మేరకు పరిష్కరిస్తారంటూ కలెక్టర్‌ భాస్కర్‌ ఆరా తీశారు. తనకు టాప్‌ ప్రయార్టీ గ్రీవెన్స్‌ సెల్లేనని స్పష్టం చేశారు. గ్రీవెన్స్‌ పరిష్కారానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. జిల్లా అధికారులందరూ(హెచ్‌వోడీలు) గ్రీవెన్స్‌కు విధిగా వస్తుంటారా? లేదా అని ఆరా తీశారు. గ్రీవెన్స్‌కు హెచ్‌వోడీలందరూ వస్తారని డీఆర్‌వో చంద్రశేఖరరెడ్డి చెప్పగా.. ఏ ఒక్కరు మిస్‌కాకుండా చూడాలని సూచించారు. కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులోనే గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహిస్తుంటామని, వచ్చే అర్జీదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. గ్రీవెన్స్‌ సెల్‌ ఎలా ఉంటుందో తాను చూస్తానని చెప్పారు.

కలెక్టరేట్‌ సందర్శన: అనంతరం సబ్‌కలెక్టర్, డీఆర్‌వో, ఏవోలతో కలిసి కలెక్టరేట్‌కు చేరుకుని గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించే మీటింగ్‌ హాలును పరిశీలించారు.హెచ్‌వోడీలు, ఇతర సిబ్బంది కూర్చునే సీటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top