పంచాయతీలు విలవిల | Collected taxes to solve their problems | Sakshi
Sakshi News home page

పంచాయతీలు విలవిల

Jun 18 2014 3:06 AM | Updated on Sep 2 2017 8:57 AM

జిల్లాలో 1028 పంచాయతీలున్నాయి. గ్రామాల్లో పంచాయతీ అధికారులు ఏటా పన్నులు వసూలు చేసుకుంటూ సమస్యలు పరిష్కరించాలి.

రోజురోజుకూ కునారిల్లుతున్న పంచాయతీల దుస్థితికి పాలకులే కారణం. ఈ పాపంలో అధికారుల నిర్లక్ష్యానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం తోడవడం మరీ ఘోరం. గ్రామాభివృద్ధికి పన్నుల వసూళ్లే కీలకం. వాటిని  వసూలు చేయకపోవడంతో బకాయిలు ఏటేటా కొండలా పెరిగిపోతున్నాయి.  ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఫలితంగా సమస్యలతో అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.
 
 ఒంగోలు టూటౌన్ : జిల్లాలో 1028 పంచాయతీలున్నాయి. గ్రామాల్లో పంచాయతీ అధికారులు ఏటా పన్నులు వసూలు చేసుకుంటూ సమస్యలు పరిష్కరించాలి. జిల్లా పంచాయతీ అధికారి తరచూ తనిఖీలు నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి సూచనలివ్వాలి. పన్ను వసూళ్లకు చర్యలు తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ ఈ జిల్లాలో కనిపించడం లేదు. ఒక్కసారి 2013-14 సంవత్సరంలో పన్నుల వసూళ్లను పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది. మొత్తం రూ.13,24,29,898లకు గాను ఇప్పటి వరకు రూ.8,82,78,081 మాత్రమే వసూలు చేశారు. ఇవికాక పాత బకాయిలు దాదాపు రూ.22,05,48,490 ఉండగా, ఇప్పటి వరకు రూ.12,20,75, 054 వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా దాదాపు రూ.10 కోట్ల వరకు బకాయిలున్నాయి. చాలినన్ని నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో సమస్యలు తిష్టవేశాయి.
 
 జీతాలు లేక అవస్థలు

 =    పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలిచ్చే పరిస్థితి లేదు.
 =    పారిశుద్ధ్య కార్మికులతో పాటు టైమ్ స్కేల్ కార్మికులు, పర్మనెంట్, టెండర్.. ఎన్‌ఎంఆర్ విధానంలో కార్మికులు పనిచేస్తున్నారు.
 =    జిల్లాలో పర్మనెంట్, టైమ్ స్కేల్ కార్మికులు దాదాపు 125 మంది వరకు ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు వెయ్యి మందికి పైగా పనిచేస్తున్నారు.
 =    పర్మనెంట్ కార్మికులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని 2011లో అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
 =    దీనికి జిల్లా స్థాయి కమిటీ కూడా ఉంది. కమిటీ నిర్లక్ష్యం కారణంగా వారు ట్రెజరీ ద్వారా జీతాలకు నోచుకోవడంలేదు. పారిశుద్ధ్య కార్మికులకు చాలాచోట్ల నేటికీ నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబంతో సహా తల్లడిల్లుతున్నారు.
 విద్యుత్ బిల్లుల బకాయిలు
 =    విద్యుత్ బకాయిలు పంచాయతీలకు గుదిబండగా మారాయి.
 =    గత ప్రభుత్వాలు మైనర్ పంచాయతీలు కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని అప్పట్లో సర్పంచ్‌ల సంఘానికి హామీ ఇచ్చాయి.  
 =    జిల్లాలో దాదాపు 106 పంచాయతీలకు విద్యుత్ బిల్లుల బకాయిలు సుమారు రూ.12 కోట్ల వరకు ఉన్నాయి.
 =    కొన్ని పంచాయతీల్లో బిల్లులు చెల్లించ కపోవడంతో రెండు నెలల క్రితం ఫీజులు తొలగించారు. దీంతో పల్లెల్లో అంధకారం అలుముకుంది.

 శాశ్వత భవనాల సమస్య

 =    పంచాయతీ భవనాలు లేని గ్రామాలకు మూడేళ్ల కిందట 350 కొత్త భవనాలు మంజూరయ్యాయి. ఒక్కోదానికి రూ.10 లక్షలు విడుదలయ్యాయి.
 =    పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు పనులు అప్పగించారు. ఇప్పటికి కనీసం 100 కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. ఇక తాగునీటి సమస్య ఉండనే ఉంది.
 =    పంచాయతీల అభివృద్ధికి కీలకమైన పన్నుల వసూళ్లలో అధికారులు, సిబ్బంది అలవిమాలిన నిర్లక్ష్యం వహిస్తున్నారు.
 =    {పభుత్వం విడుదల చేయాల్సిన సెస్‌లు, కొత్తపన్నులు దాదాపు రూ.200 కోట్ల వరకు బకాయి పడినట్లు సర్పంచుల సంఘ నేతలు ఆరోపిస్తున్నారు.
 =    నిధుల లభ్యత లేకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement