తుమ్మపాల(అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామంలో గత ప్రభుత్వంలో మంజూరైన ఆరోగ్య సేవ కేంద్రం నిర్మాణానికి సంబంధించి పంచాయతీ ఖాతాకు జమ అయిన ఆ నిధులను తనకు చెల్లించాలని అడిగినందుకు కాంట్రాక్టర్‌ను రోజంతా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. సబ్బవరం మండలం మొగలిపురం గ్రామానికి చెందిన యడ్ల నాయుడు గత ప్రభుత్వంలో ఆరోగ్య సేవ కేంద్రాన్ని నిర్మించారు. ఇప్పటికే అది ప్రారంభమైంది.
గత ప్రభుత్వంలో కొంత బిల్లు మంజూరైంది. మిగిలిన రూ.7.50 లక్షల బిల్లు ఈ ప్రభుత్వం వచ్చాక విడుదలైంది. ఈ మొత్తాన్ని తనకు చెల్లించాలని ఏడాదిన్నరగా కాంట్రాక్టర్ నాయుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోలేదు. ఈ విషయమై సోమవారం కలెక్టరేట్‌లో పంచాయతీ అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు స్టేషన్‌కు తీసుకెళ్లి రోజంతా ఆయన్ను నిర్బంధించారు.


