తాకట్టులో ఆంధ్రప్రదేశ్‌ ఖజానా! | Kommineni Srinivasa Rao Analysis On Andhra Pradesh Treasury | Sakshi
Sakshi News home page

తాకట్టులో ఆంధ్రప్రదేశ్‌ ఖజానా!

May 6 2025 11:17 AM | Updated on May 6 2025 11:38 AM

Kommineni Srinivasa Rao Analysis On Andhra Pradesh Treasury

ఇది విన్నారా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఖజానానే తాకట్టు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అది కూడా రూ.9500 కోట్ల అప్పు కోసం! ఏడాది కూడా నిండని కూటమి పాలనలో ఇప్పటికే రికార్డు స్థాయిలో రూ.1.47 లక్షల కోట్ల అప్పులయ్యాయి. ఇవి చాలవన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అదనంగా ఖజానాను తాకట్టు పెట్టి రుణాలు పొందే ప్రయత్నం చేస్తోంది. గనుల మాదిరిగానే ట్రెజరీని కూడా తాకట్టు పెడుతున్నట్టుగా ఒప్పందం ఉండటం.. రుణ వాయిదాలు సకాలంలో చెల్లించలేకపోతే రిజర్వు బ్యాంక్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ఖాతా నుంచి నేరుగా వసూలు చేసుకోవచ్చట. 

ఈ వార్త విన్నప్పుడు తొలుత అది నిజమై ఉండదులే అనుకున్నాం. కాని వైసీపీ సీనియర్ నేత, ఆర్ధిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్వయానా ఈ విషయం చెప్పడంతో అదెలా సాధ్యమని అనిపించింది. ఖజానా తాకట్టు గురించి బుగ్గన విపులంగా వివరించినా.. కూటమి ప్రభుత్వం దానికి వివరణ కూడా ఇవ్వలేదు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు.  ఇప్పుడు ట్రెజరీ ఖాతాకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. 

గతంలో ప్రభుత్వానికి అప్పులు అవసరం అయినప్పుడు  మరీ బ్యాంకులు కోరితే ప్రభుత్వ కార్యాలయాలను తనఖా పెట్టడం జరిగేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే విపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పెద్ద ఎత్తున రచ్చ చేశాయి. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు జరగరానిది ఏదో జరిగిపోతోందని ప్రజలను భయపెట్టే యత్నం చేసేవి. వీటి ప్రభావం సహజంగానే ప్రజలపై ఎంతో కొంత ఉంటుంది. ఆ రకంగా చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ ఎన్నికల రాజకీయాల కోసం ఎన్ని చేయాలో అన్నీ చేశారు. అబద్దపు ప్రచారం చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌  అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి తన వంతు దుష్ప్రచారం చేశారు. జగన్ సర్కార్ నిత్యం అప్పు చేస్తోందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేస్తోందని, శ్రీలంక అయిపోతుందని ఇలా ఏది పడితే అది మాట్లాడి జగన్ ప్రభుత్వంపై ప్రజలలో సందేహాలు వచ్చేలా వ్యవహరించారు. తాము అధికారంలోకి వస్తే  అప్పులు తేబోమని, ఉన్న అప్పులు తీర్చుతామని, చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసని ఊదరగొట్టేవారు. దీనితోపాటు తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్, మరో వంద ఎన్నికల హామీలు అంటూ ప్రచారం చేసి బాండ్లు కూడా ఇచ్చి వచ్చారు.

 ఎలాగైతే  అధికారం సాధించారు. ఇప్పుడేమో అప్పు చేయడమే సంపద అని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పోనీ దానిపై క్లారిటీతో మాట్లాడుతున్నారా అంటే అదీ లేదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని తనకూ ఆశగా ఉందని, కాని ఖజానా ఖాళీగా ఉందని, అప్పులు కూడా పుట్టడం లేదని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు అంటున్నారు. కానీ ఏడాది కాక ముందే రూ.లక్షన్నర కోట్లు ఎలా అప్పు చేశారని ఆయనను ఎవరూ అడగరు. ప్రశ్నించే పరిస్థితి లేకుండా రెడ్ బుక్ అంటూ భయపెడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌  ఇలాంటివి పట్టించుకోవడం మానేసి చాలాకాలమైంది. 

కాని జనానికి వీరు చేస్తున్న  మాయ అర్ధం అవుతోంది. అప్పుల మీద చంద్రబాబు గతంలో ఏమి చెప్పింది..ఇప్పుడు ఏమి చేస్తున్నది బెరీజు వేసుకుంటున్నారు. గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో రూ.వెయ్యి కోట్లు అప్పు తీసుకున్నా, దానిని మొదటి పేజీలో ప్రచురించి, అప్పులు తప్ప ఏపీలో ఇంకేమీ జరగడం లేదన్నట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు తన సభలలో జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తూ నాశనం చేస్తోందని, ఒకసారి పది లక్షల అప్పు చేశారని, మరరో సారి 13 లక్షల కోట్లుఅని, ఇంకోసారి ఏకంగా 14 లక్షల కోట్లు అని దుర్మార్గంగా పబ్లిసిటీ చేశారు.

ఒక్క జగనే అంత భారీగా అప్పు చేశారా అన్న  అనుమానం కలిగించారు. అంతే తప్ప, రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత అప్పు ఉంది. 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఎంత అప్పు చేసింది? ఆ తర్వాత జగన్ టైమ్ లో ఎంత అప్పు అయింది విడమరిచి చెప్పకుండా, మొత్తం అప్పంతా జగన్ ఖాతాలో వేసేశేవారు. అదే చంద్రబాబు గొప్పదనం. ఎంతటి అబద్దాన్ని అయినా నమ్మించేలా మాట్లాడగల సత్తా కలిగిన నేత అని ఆయన ప్రత్యర్ధులు చెబుతుంటారు. 

ఈ అప్పులపై ఆయన చేసిన దుష్ప్రచారం దానిని నిర్ధారిస్తుంది. విశేషం ఏమిటంటే జగన్ టైమ్‌లో రెండేళ్ల కరోనా ఉన్నా రూ.3.30 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేశారని వెల్లడైంది. ఆ వివరాలు టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్టే  తెలిపింది. కాని కేశవ్ కార్పొరేషన్ల ద్వారా జగన్ ప్రభుత్వం అప్పు చేయడాన్ని  ఆక్షేపించారు. సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వపరంగా నేరుగా చేసిన అప్పులే లక్ష కోట్లు ఉంటే మరో రూ.ఏభై వేల కోట్లు అమరావతి పేరుతో తీసుకుంటున్నారు. అందులో ఇప్పటికే రూ.31 వేల కోట్లకు ఒప్పందం అయ్యారు. కేంద్ర  ఆర్థిక సంఘం కేపీలో పర్యటించినప్పుడు అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరమన్నారు. అమరావతిలో చేపడుతున్నామని రూ.లక్ష కోట్ల విలువైన పనులు మంత్రి నారాయణ చెప్పారు. ఒక్క రూపాయి వ్యయం ప్రభుత్వపరంగా చెయనవసరం లేదని చెప్పిన చంద్రబాబు చేస్తున్న  నిర్వాకం ఇదన్నమాట. 

ఈ క్రమంలో తాజాగా ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా రూ. తొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి నిజంగానే పరపతి పోయిందేమో తెలియదు కాని, బాండ్ల రూపంలో ఆ అప్పు ఇచ్చినవారికి నమ్మకం కలిగించడానికి రాష్ట్రంలో ఉన్న సుమారు రూ.1.91 లక్షల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలన్నిటిని ఖనిజాభివృద్ధి సంస్థకు బదలాయించి, వాటిని చూపించి ఈ అప్పు తీసుకున్నారు. అయినా బాండ్లు  కొన్నవారికి ఇంకా అపనమ్మకంగానే  ఉన్నట్లు ఉంది. అందుకే  ఒకవేళ ఖనిజాభివృద్ది సంస్థ ఖాతాలో రుణ వాయిదాల ఆరునెలల మొత్తం డిపాజిట్ లేకపోతే, ఆ ప్రైవేటు సంస్థలు, లేదా వ్యక్తులు ప్రభుత్వానికి రిజర్వు బ్యాంక్‌లో ఉండే ఖాతా నుంచి నేరుగా తమ రుణ వాయిదాను రాబట్టుకోవచ్చని చెబుతూ  జీవోనే ఇచ్చేశారు. ఇది ఒకరకంగా దుస్సాహసమే. ప్రజల పట్ల బాధ్యతలేని పద్దతే అని అనాలి. 

చంద్రబాబు సర్కార్ విడుదల చేసిన జీవో లోని అంశాలను పేర్ని నాని ఏప్రిల్  24న చదివి వినిపించారు. నేరుగా ఏపీ అకౌంట్‌ నుంచి డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం ద్వారా అవకాశం ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని నాని అన్నారు. అది వాస్తవమైనా, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఊహాలోకంలో వారిని ప్రశ్నించేవారు లేరు. వైసీపీ వారు ప్రశ్నించినా పట్టించుకున్న నాథుడు లేడు. విశేషం ఏమిటంటే ఇప్పటివరకు చేసిన అమరావతికి కాకుండా చేసిన లక్ష కోట్ల అప్పు ఏమి చేసింది కూడా ప్రభుత్వం వివరించలేదు.

జగన్ ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి శ్వేతపత్రాలు అంటూ  పిచ్చి పత్రాలు  విడుదల చేసిన సర్కార్,  జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ 2 అంటూ కాకి లెక్కలు చెప్పిన సర్కార్ , ధైర్యంగా ఈ లక్ష కోట్లు  ఏ రకంగా వ్యయం చేసింది ఎందుకు చెప్పలేకపోతున్నారు? సూపర్ సిక్స్ హామీల అమలుకు ఈ మొత్తంలో ఎంత వ్యయం చేశారో చెబుతారా? బడ్జెట్‌లో చిల్లర ఖర్చుల కోసం దాదాపు రూ.8 వేల కోట్ల రూపాయలు కేటాయించి మరో రికార్డును కూడా ఈ ప్రభుత్వం సృష్టించింది. మరో వైపు గత ప్రభుత్వ టైమ్‌లో వచ్చిన ఆదాయం కంటే ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు రూ.13 వేల కోట్లు  తగ్గిందని నిపుణులు లెక్కలు చూపుతున్నారు. ఇలాంటి వాటిపై సోషల్ మీడియాలో పలువురు విశ్లేషకులు  ప్రశ్నిస్తున్నా జవాబు చెప్పడం లేదు.అందువల్లే  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు  పిట్టల దొర కబుర్లు  చెబుతూ, ఆకాశంలో మేడలు కడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. సంపద సృష్టించడం సంగతి దేవుడెరుగు. ఏపీని ఈ రకంగా అప్పుల పాలు చేయకుండా ఉంటే చాలు దేవుడా అని జనం అనుకునే పరిస్థితి ఏర్పడింది. 


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement