
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసేందుకు 20వ తేదీన పోలవరం వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. హెడ్ వర్క్స్(జలాశయం), కుడి, ఎడమ అనుసంధానాలు(కనెక్టివిటీస్), నావిగేషన్ కెనాల్, పవర్ ప్రాజెక్టు, కుడి, ఎడమ కాలువల పురోగతి, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ చేసిన పనులను గోదావరి వరద బారి నుంచి రక్షించుకోవడం, నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలు చేపట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు.
క్షేత్ర స్థాయిలో తన పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడంపై సీఎం వైఎస్ జగన్ దృష్టిసారించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 19వ తేదీన జలవనరులశాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు.