ముమ్మరంగా.. ధాన్యం కొనుగోళ్లు

CM YS Jagan Review Meeting With Officials On Grain purchases - Sakshi

వర్షాలతో దెబ్బతినడానికి అవకాశమున్న పంటల సేకరణలో వేగం పెంచాలి

తుపాను రాష్ట్రం వైపు వస్తే మరింత సన్నద్ధంగా ఉండాలి

ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి

బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలి 

తుపాను నేపథ్యంలో కల్లాల్లో ఉన్న ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలి

ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం 

వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే.. పండే పంటలో మూడింట ఒక వంతు కొనుగోలు చేయాలి.  కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను సేకరించడంతో పాటు మార్కెట్‌ కల్పించేలా చూడాలి. ఈ విధానాన్ని వ్యవస్థీకృతం చేసుకుంటేనే ధరల స్థిరీకరణ జరుగుతుంది. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: తుపాను ఆంధ్రప్రదేశ్‌ వైపు వస్తే ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తుపాన్‌ను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్లను ఉధృతం చేయాలని, కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వీలైనంత త్వరగా కొనుగోలు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. వర్షాల వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలన్నారు. కోవిడ్‌–19 విపత్తు నేపథ్యంలో రైతుల ఉత్పత్తుల కొనుగోళ్లు, ఎంఫాన్‌ తుపాన్‌ సంసిద్ధత అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 

సర్వసన్నద్ధంగా ఉండాలి
► తుపాను ఏపీ వైపు వస్తే ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా ఉండాలి. తుపాను కదలికల్ని ఎప్పటికప్పుడు గమనించాలి. విద్యుత్, రెవెన్యూ, పౌర సరఫరాలు, వైద్య శాఖ సన్నద్ధంగా ఉండాలి. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి. 
► వేట నిషేధ సమయమే అయినప్పటికీ.. బోట్లలో సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలి. తుపాన్‌ను ఎదుర్కోవడానికి, తగిన చర్యల కోసం కొంత మంది అధికారులను సిద్ధం చేసుకోవాలి. ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. 
► తుపాన్‌ దృష్ట్యా  ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి. ధాన్యం సేకరణలో మరింత ఉధృతంగా ఉండాలి. కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంత వరకూ కొనుగోలు చేయాలి. వర్షాల వల్ల దెబ్బ తినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలి. 
► ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిషబుల్‌ గూడ్స్‌ (త్వరగా పాడయ్యేవి)ను ఈ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top