‘అమృత్‌’ పనులు వేగవంతం చేయండి | CM YS Jagan Comments In Municipal Department Review Meeting | Sakshi
Sakshi News home page

‘అమృత్‌’ పనులు వేగవంతం చేయండి

May 28 2020 5:54 AM | Updated on May 28 2020 5:54 AM

CM YS Jagan Comments In Municipal Department Review Meeting - Sakshi

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘అమృత్‌’ పథకం కింద రూ.3,762 కోట్లతో రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పురపాలక శాఖను ఆదేశించారు. ఆర్థికంగా బలంగా లేని మున్సిపాలిటీలకు నిధులు సమకూర్చడంలో ఉన్న ఇబ్బందులను తొలగించాలని.. అందుకు రూ.800 కోట్ల లోటును భర్తీ చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. పురపాలక శాఖలో అభివృద్ధి పనులపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► విజయవాడ, గుంటూరులలో చేపట్టిన డ్రైనేజీ పనులను సత్వరం పూర్తిచేయాలి.
► విశాఖపట్నానికి నిరంతరం తాగునీటి సరఫరా కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. 
► స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద విశాఖ, కాకినాడ, తిరుపతిలో రూ.4,578 కోట్లతో చేపడుతున్న పనులను సత్వరం పూర్తి చేయాలి.
► ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) ఆర్థిక సహాయంతో లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న 50 పట్టణాల్లో తాగునీటి సరఫరాకు రూ.5,212 కోట్లతో చేపట్టిన పనులపై దృష్టి సారించాలి. ఈ పట్టణాలకు వెళ్లే దారిలోని 111 గ్రామాలకూ తాగునీరు అందించాలి. 
► ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి జూలై 8న లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు పంపిణీ చేసేందుకు సిద్ధంకావాలి. విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరగా సిద్ధంచేయాలి. 
► లక్ష జనాభా దాటిన పట్టణాల్లో రూ.10,666 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు సన్నద్ధం కావాలి.

మోడల్‌ మున్సిపాలిటీలుగా తాడేపల్లి, మంగళగిరి 
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను మోడల్‌ మున్సిపాలిటీలుగా అభివృద్ధి చేసే అంశంపై కూడా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో సమీక్షించారు. ఆయన ఏమన్నారంటే..
► రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు రూపొందించాలి. 
► 100 శాతం తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించండి.
► పాఠశాలల అభివృద్ధి కోసం ‘నాడు–నేడు’ కార్యక్రమంలో చేపట్టిన పనుల కన్నా మరింత ఆధునిక వసతులు సమకూర్చేలా ప్రతిపాదనలు తయారుచేయండి.
► జనాభా ప్రాతిపదికన నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలి. 
► పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ఉండాలి. 
► మంగళగిరిలో చేనేతలకు కాంప్లెక్స్, ప్రభుత్వ కార్యాలయాలకు సమగ్ర కాంప్లెక్స్‌ నిర్మాణాలకు సంబంధించి జూన్‌ నాటికి పరిపాలనా అనుమతులివ్వాలి.  
► మంగళగిరి ఆలయ అభివృద్ధి పనులు, మాడ వీధుల పునర్నిర్మాణం.. బకింగ్‌హామ్‌ కాలువ అభివృద్ధి, కాల్వల సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధిపై కూడా సీఎం చర్చించారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement