రైతులు రూపాయి కడితేచాలు

CM YS Jagan Comments on crop insurance dues payment program - Sakshi

మిగతా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది

పంటల బీమా బకాయిల చెల్లింపు కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

2018–19లో రబీ పంటల బీమా ప్రీమియం చెల్లించని గత సర్కారు 

ఆ సొమ్ము చెల్లించి రైతులకు న్యాయం

తద్వారా 5.94 లక్షల మంది రైతులకు రూ.596.36 కోట్ల ప్రయోజనం 

అలాంటి ఇబ్బంది మళ్లీ రాకూడదు 

అందుకే పంటల బీమా ప్రీమియం చెల్లింపులో సమూల మార్పులు 

రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటల ఈ–క్రాపింగ్‌

ఆ వెంటనే ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ 

గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించండి

పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు సంబంధించి వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. గ్రామ సచివాలయాల్లో సర్వేయర్, రెవెన్యూ, వ్యవసాయ సహాయకుల సంయుక్త పర్యవేక్షణలో ఈ–క్రాపింగ్‌ నమోదు చేస్తున్నాం. ఆ వెంటనే పంటల ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. రైతు కేవలం ఒక్క రూపాయి ప్రీమియం కడితే చాలని నిర్ణయించాం. మిగతా మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది.
– సీఎం వైఎస్‌ జగన్‌    

సాక్షి, అమరావతి: రైతుల పంటల బీమా ప్రీమియం చెల్లింపులో సమూల మార్పులు చేశామని, అందులో భాగంగా రైతులపై ఏ మాత్రం భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెలిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. రైతుల నుంచి నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతులకు నష్టం చేకూరిస్తే, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అన్నదాతలకు మేలు చేస్తోందన్నారు. 2018–19 రబీ పంటల బీమా ప్రీమియంకు సంబంధించి అప్పటి ప్రభుత్వం బకాయి పడిన రూ.122.61 కోట్లను ఈ ప్రభుత్వం చెల్లించింది. దీంతో అప్పటి పంట నష్టానికి సంబంధించి బీమా కంపెనీలు రూ.596.36 కోట్ల క్లెయిమ్స్‌ విడుదల చేశాయి. ఈ మొత్తాన్ని రాష్ట్రంలో 5.94 లక్షల మంది రైతుల ఖాతాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా జమ చేశారు. ఆ నగదును బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకోకుండా, అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన వివిధ జిల్లాల్లో లబ్ధిదారులైన రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం
► వ్యవసాయ పంటల బీమా విషయంలో మా ప్రభుత్వం ఏం చేస్తోందో అందరికీ తెలిసేలా చేస్తున్నాం. గత ప్రభుత్వం 2018–19 రబీ సీజన్‌లో బీమా ప్రీమియం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 
► నిజానికి బీమా ప్రీమియంను కొంత రైతు చెల్లిస్తాడు.. మిగిలింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా సీజన్‌ ప్రారంభంలో నెల రోజుల్లోనే బీమా ప్రీమియం చెల్లింపులు జరుగుతాయి. అలా జరిగినప్పుడే రైతులకు బీమా పరిహారం సమయానికి అందుతుంది.
► కానీ 2018–19కి సంబంధించిన రబీ బీమా ప్రీమియం రూ.122.61 కోట్లు గత ప్రభుత్వం చెల్లించలేదు. రైతులు, కేంద్ర ప్రభుత్వం తమ వంతు ప్రీమియం చెల్లించాయి. కానీ రాష్ట్రం సరైన సమయంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల రైతులకు ఇన్సూరెన్స్‌ ప్రీమియం రాని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రైతులకు ఎక్కువ నష్టం జరిగింది.

ఆ బకాయిలు మేము చెల్లించాం
► ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని, సకాలంలో రైతులకు సహాయం అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. బీమా అధికారులతో చర్చలు జరిపి, 2018–19 కి సంబంధించిన బకాయిలు రూ.122.16 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. 
► దీంతో ఈ రోజు 5.94 లక్షల మంది రైతులకు రూ.596.36 కోట్ల పరిహారం అందిస్తున్నాం. బీమా పరిహారం సొమ్మును పాత అప్పులకు జమ చేసుకోకుండా కలెక్టర్లు అందరూ బ్యాంకర్లతో మాట్లాడాలని ఆదేశించాం. 

రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉంటాం
► రైతు భరోసా సొమ్ము ఇవ్వడం నుంచి రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం, ఈ–క్రాపింగ్, ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్, పంట రుణాలు రాని వారికి రుణాలు ఇప్పించే కార్యక్రమం వరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
► రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తున్నాం. రైతు వేసే పంటకు సంబంధించి నిపుణులతో సూచనలు, సలహాలు, రైతు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించడం వంటి విషయాల్లో పూర్తిగా అండగా ఉంటాం. ఇందుకోసం సమూల మార్పులు తీసుకొచ్చాం. 
► గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించండి. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్ల ఇదంతా చేయగలగుతున్నాను.
► ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, బీమా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.   

ఆ డబ్బులు వస్తాయనుకోలేదు..
‘ఆ బీమా మొత్తం వస్తుందనుకోలేదు.. మీ చలవ వల్లే ఆ సొమ్ము అందింది. మీరు ఇచ్చిన భరోసాతో రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేస్తున్నారు. ఎప్పటికీ మీరే సీఎంగా ఉండాలి’ అని పలువురు రైతులు వైఎస్‌ జగన్‌తో అన్నారు. 2018–19 రబీ బీమా బకాయి సొమ్ము రూ.596.36 కోట్లను శుక్రవారం సీఎం విడుదల చేసిన సందర్భంగా వివిధ జిల్లాల నుంచి పలువురు రైతులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 

అన్నీ కలసి వస్తున్నాయి..
కరోనా సమయంలో కూడా మీరు ఇస్తున్న ఈ పరిహారం మాకెంతో మేలు చేస్తుంది. గత ప్రభుత్వంలో ఎంతో నష్టపోయాం. 2018లో ఇన్సూరెన్సు కట్టినా పరిహారం రాలేదు. ఇక వస్తుందనుకోలేదు. అలాంటిది ఇవాళ నాకు రూ.1.26 లక్షల పరిహారం వచ్చింది. రైతు భరోసా కింద రూ.13,500 సహాయం అందింది. గ్రామ సచివాలయ వ్యవస్థ చాలా గొప్పగా పని చేస్తోంది. మాకు అమ్మ ఒడిలో సహాయం కూడా అందింది. మీ హయాంలో సకాలంలో వర్షాలు పడుతున్నాయి. అన్నీ కలసి వస్తున్నాయి. కలకాలం మీరే సీఎంగా ఉండాలి.    
– జయరామిరెడ్డి, జయవరం, ప్రకాశం జిల్లా
 
మీరు చరిత్రలో నిలిచిపోతారు..
నేను 2018లో బజాజ్‌ కంపెనీకి ప్రీమియం కట్టాను. కానీ పరిహారం రాలేదు. ఇప్పుడు మీ కృషితో బీమా సొమ్ము రూ.28,178 వచ్చింది. రైతు భరోసా కేంద్రంలో లబ్ధిదారుల జాబితాలో నా పేరు పెట్టారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాది మెట్ట ప్రాంతం. పంటలు పండకపోతే బీమానే దిక్కు. అది మీరు గమనించే ఉచిత బీమా కల్పిస్తున్నారు. రైతులకు ఉదారంగా సాయ పడే విషయంలో గతంలో రాజశేఖరరెడ్డి గారిని చూశాం. మళ్లీ మిమ్మల్ని చూస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలు రైతులకు దేవాలయాల వంటివి. మీరు చరిత్రలో నిలిచిపోతారు.     
    – భాస్కర్‌రెడ్డి, వీరపునాయనిపల్లె మండలం, వైఎస్సార్‌ కడప జిల్లా

రైతులు ఆశ్చర్యపోతున్నారు
మీరు ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా గత ప్రభుత్వ బకాయిలు కూడా ఇస్తున్నారు. చాలా పంటలను బీమా పరిధిలోకి తీసుకువచ్చారు. ఎంత భారమైనా భరిస్తున్నారు. శనగ రైతులకు కూడా ఎంతో ప్రయోజనం కల్పించారు. రైతు భరోసా కేంద్రాలు బాగా పని చేస్తున్నాయి. సాయంత్రం కాగానే రైతులు అక్కడ కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా మీరు చేస్తున్నారని రైతులు ఆశ్చర్యపోతున్నారు.
    – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి

విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు
పంటలు పండించడానికి భయపడే పరిస్థితిలో మీరు ఇస్తున్న భరోసాతో రైతులు మళ్లీ సాగు చేస్తున్నారు. మీరు వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు విప్లవాత్మకమైనవి. రైతుల పట్ల మీకు ప్రేమ, ఆప్యాయత ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు ఎంతో మేలు చేస్తున్నారు. 
    – పోతుల సునీత, ఎమ్మెల్సీ

ఇంత బీమా సొమ్ము ఇదే మొదటిసారి
గతంలో ప్రీమియం కట్టినా ఏనాడూ రూ.4 వేలకు మించి రాలేదు. ఇవాళ నాకు లక్ష రూపాయల వరకు వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో పంటల బీమా పరిహారం పొందడం జీవితంలో మొదటిసారి. గత ప్రభుత్వ హయాంలో ఏనాడూ రైతులకు ఇంతగా న్యాయం జరగలేదు. రైతు భరోసా ద్వారా రూ.13,500 వస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మంచి సేవలందుతున్నాయి. ఉన్న ఊళ్లోనే విత్తనాలు, పురుగు మందులు ఇస్తున్నారు. ఇప్పుడు బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే కడతామంటోంది. ఈ పాలనను సువర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చు.
    – పురుషోత్తం, మాంభట్టు, తడ మండలం, నెల్లూరు జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top