కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు

CM YS Jagan Comments On contract Employees Salaries - Sakshi

గ్రీన్‌ చానల్‌లో నిర్ణీత సమయానికి ఇవ్వాల్సిందే

సామాజిక, ఆరోగ్య భద్రతపై అధ్యయనం చేయాలి

సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం

ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. పర్మినెంట్‌ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్టు ఉద్యోగులకూ సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను త్వరగా అందించాలి.

సాక్షి, అమరావతి: రెగ్యులర్‌ ఉద్యోగుల తరహాలోనే వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గ్రీన్‌ చానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, వారి జీతాలు, స్థితిగతుల గురించి అధికారులు సీఎంకు వివరించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి.
కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

► రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదని ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్‌పై హడావిడిగా జీవో జారీ చేసిందని, అయినా అమలు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుందని సమావేశంలో చర్చకు వచ్చింది. 
► ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 జూలై నుంచి మినిమం టైం స్కేల్‌ అమలు చేస్తున్నారు. ఫలితంగా 2017 మార్చి 31న ఉన్న జీతాలు.. 2019 జూలై నాటికి 88 శాతం నుంచి 95 శాతం వరకు పెరిగాయి. 
► జూనియర్‌ లెక్చరర్‌కు రూ.19,050 ఉన్న జీతం 2019 జూలై నాటికి 95 శాతం పెరిగి రూ.37,100 అయ్యింది.
► మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (మేల్‌) జీతం రూ.14,860 నుంచి 88 శాతం పెరిగి రూ.22,290 అయ్యింది.
► సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) జీతం రూ.10,900 నుంచి 95 శాతం పెరిగి రూ.21,230 అయ్యింది. 
► స్కూల్‌ అసిస్టెంట్‌ జీతం రూ.10,900 నుంచి 95 శాతం పెరిగి రూ.21,230 అయ్యింది. 
​​​​​​​► దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1,000 కోట్ల భారాన్ని ఈ ప్రభుత్వం భరిస్తోందని అధికారులు వెల్లడించారు.
​​​​​​​► సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్, జీఏడీ సర్వీసెస్‌ సెక్రటరీ శశిభూషణ్, కార్మిక శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ మల్లికార్జున్‌ తదితరులు హాజరయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top